Degree Courses | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : డిగ్రీలో నచ్చిన కోర్సును ఎంపికచేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్(బీవోసీ) సిస్టం రద్దుకానుందా..? మళ్లీ పాత విధానమే ఉండబోతుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విధానాన్ని పలు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. డిగ్రీ కోర్సుల్లో 2021 నుంచి బీవోసీని అమలు చేస్తున్నారు. మొత్తం డిగ్రీ కోర్సులను ఏ, బీ, సీ, డీ బకెట్లుగా విభజించారు. ఈ విధానంతో గతంలో పదుల సంఖ్యలో ఉన్న డిగ్రీ కోర్సులు ఇప్పు డు 505 అయ్యాయి. సబ్జెక్టు కాంబినేషన్లు పూర్తిగా మారిపోయాయి.
డిగ్రీ కోర్సుల్లో మా ర్పులు చేర్పులపై ఇటీవలే ఉన్నత విద్యామండలి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో బకెట్ సిస్టంతో వస్తున్న ఇబ్బందులను బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీవోఎస్) స భ్యులు ఏకరువుపెట్టారు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గుతున్నట్టుగా పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు డిమాండ్ అధికంగా ఉండగా, ఆర్ట్స్ కోర్సులకు అంతగా డిమాండ్ ఉండటంలేదు. సబ్జెక్టుల పునరావృతం సైతం బకెట్ సిస్టంపై వ్యతిరేకతకు కారణమవుతున్నది. అయితే బకెట్ సిస్టం రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ పేర్కొన్నారు.
బీఎస్సీ సైన్స్ కోర్సులోని విద్యార్థి బీఏలో ఉండే సైకాలజీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్ వంటి ఒక సబ్జెక్టును ఎంపికచేసుకోవడం బకెట్ సిస్టం ప్రత్యేకత. ఈ విధానంలో డిగ్రీ కోర్సుల్లోని వారు తమకు ఆసక్తి ఉన్న, కోర్సుతో సంబంధంలేని మరో సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. అంటే ఆర్ట్స్ విద్యార్థి సైన్స్ కోర్సులను.. సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్ కోర్సులను తీసుకోవచ్చు. డిగ్రీలో నాలుగు బకెట్స్ ఉండగా.. ఒక్కో బకెట్లో కొన్ని సబ్జెక్టులుంటాయి. విద్యార్థి రెండు కోర్సులకు సంబంధించిన మేజర్ సబ్జెక్టులను, ఇతర బకెట్‌లోని మరో సబ్జెక్టును ఎంపికచేసుకోవచ్చు.
ఇక బీఎస్సీలో పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిపుణులు కోరారు. వర్తమాన పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా 6 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. నిరుడు బీఎస్సీ బయో మెడికల్‌సైన్స్ కోర్సును ప్రవేశపెట్టగా, ఈసారి సైన్స్‌లో కొత్త కోర్సులను తీసుకురావాలని అధికారులను కోరారు.