హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంపై నమ్మకంతో ఎన్నో ఆశలు పెట్టుకొని విదేశాల్లో చదువు కోసం వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’లో ప్రధానంగా ‘వివేకానంద విదేశీ విద్యా’ పథకం, ‘బ్రాహ్మిణ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ (బెస్ట్)’ పథకాలకు రూ.70కోట్ల బకాయిలు పెండింగులో ఉండడంతో అటు విద్యార్థులు, ఇటు చిరువ్యాపారులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందితే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ప్రభుత్వం ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.20లక్షల చొప్పున రీయింబర్స్మెంట్ ఇస్తుంది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం వివేకానంద విదేశీ విద్యా పథకం కింద 280 మంది ఎంపికయ్యారు. వీరికి అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మంజూరు పత్రాలు కూడా ఇచ్చింది.
మరో 200మంది విద్యార్థులకు ఇంటర్యూలు పూర్తికాగా వారికి మంజూరు పత్రాలు అందలేదు. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో మంజూరైన విద్యార్థులకు నిధులు, ఇంటర్యూలైన విద్యార్థులకు మంజూరు పత్రాలు నిలిచిపోయాయి. ఈలోగా లబ్ధిదారులు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో స్వల్పకాల రుణాలు తీసుకొని యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. ఎన్నికలయ్యాక నిధులు వస్తాయనుకుంటే ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలకమండలిని రద్దుచేసింది. ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ కొత్త పాలకమండలిని నియమించలేదు.
విదేశాల్లో బాధలు వర్ణనాతీతం
మంజూరు పత్రాలు వచ్చినవారికి సు మారు రూ.50కోట్ల దాకా పెండింగ్‌లో ఉ న్నాయి. దీంతో అప్పుచేసి విదేశాలకు వెళ్లిన 280మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చాలామంది విద్యాభ్యాసంతోపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నా వచ్చే ఆదా యం అక్కడి ఖర్చులకే సరిపోవడంలేదని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫైనాన్స్ సంస్థల వేధింపులు పెరిగిపోవడంతో తమ పిల్లలు విద్యను సరిగా కొనసాగించలేక పోతున్నారని, మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు, ఇంటర్యూలు పూర్తయిన 200మంది అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది.
ఇరకాటంలో ‘బెస్ట్’ లబ్ధిదారులు
పేద బ్రాహ్మణుల స్వయం ఉపాధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం బెస్ట్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 400మంది ఈ పథకం కింద ఎంపికయ్యారు. మరో 1500దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. 400మంది లబ్ధిదారులకు రూ.20కోట్ల దాకా సహాయం అందాల్సి ఉన్నది. నిధులు వస్తాయన్న ఆశతో అప్పు చేసి వ్యాపారాలు పెట్టుకున్నవారు ఆరు నెలలు దాటినా నిధులు రాక వడ్డీలు కట్టలేక ఇరకాటంలో పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందేదని, అదే ఆశతో తాము అప్పుచేసి వ్యాపారాలు పెట్టుకొని ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తమను ప్రభు త్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.