దేశంలో పార్బాయిల్డ్ బియ్యానికి డిమాండ్ లేక కొనుగోలు చేయడం లేదని ఈ నెల 1న పార్లమెంట్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి గోయల్ తప్పుదోవ పట్టించారు. యాసంగిలో పండించిన పంట పార్బాయిల్డ్ రైసా లేక రా రైసా అనే తేడా లేకుండా కొనుగోలు చేస్తామని డిసెంబర్ 1, 2021న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. వడ్ల కొనుగోలుకు బాధ్యత ఎవరు తీసుకొంటారు? ఢిల్లీ బీజేపీనా.. లేక తెలంగాణలోని సిల్లీ బీజేపీనా? వాళ్లే చెప్పాలి
-ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వడ్లు కొనడానికి నిరాకరించిన కేంద్రంపై తెలంగాణ ఉక్కు పిడికిలెత్తింది. నూకలు తినాలని అవమానించిన బీజేపీ సర్కారుకు నూకలు చెల్లేలా చేస్తామని రైతులోకం హెచ్చరిక జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతన్నలు శుక్రవారం ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి మోదీ సర్కారు వివక్షను ఇక ఏమాత్రం సహించబోమని స్పష్టంచేశారు. ఈ నెల 4న మొదలైన నిరసనల హోరు శుక్రవారం కూడా ఉవ్వెత్తున కొనసాగింది. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, రైతుబంధు సమితి బాధ్యులు నల్ల జెండాలతో కేంద్రం తీరును ఎండగట్టారు. గ్రామాల కూడళ్లలో కేంద్రం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మల శవయాత్రలు నిర్వహించి తగులబెట్టారు.
నిజామాబాద్‌లోని వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్లో మంత్రులు కొప్పుల, గంగుల, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్ తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. మంత్రులు పువ్వాడ అజయ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగురామన్న ఎడ్లబండిపై తిరుగుతూ రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి ర్యాలీలతో నిరసన వ్యక్తంచేశారు. రైతులు ఎవరికి వారుగా స్వచ్ఛందంగా తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. మహిళా రైతులు ఇండ్ల ముందు నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష దేశమంతా తెలిసేలా చేసేందుకు సోమవారం ఢిల్లీలో చేపట్టిన మహాధర్నాకు తరలి వెళ్లేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు వివిధ మార్గాల ద్వారా దేశ రాజధాని చేరుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
తెలంగాణ బాగు చూడలేకే రాష్ట్రంపై, రాష్ట్ర రైతులపై ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, రాజీనామా చేయాలి. మోదీ కుట్రలకు స్థానిక బీజేపీ నాయకులు వంత పాడుతున్నారు.
– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
రైతులు పండించిన ధాన్యాన్ని కొనబోమంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న మోదీసర్కారుకు తగిన బుద్ధి చెప్తాం. కేంద్రం వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నది. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు మేలు చేయాలని చూస్తున్నారు. అందుకు అందరం కలిసి ముఖ్యమంత్రికి అండగా నిలబడాలి.
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మరో చారిత్రాత్మక పోరాటానికి సిద్ధం అవుతున్నారు. మేం భిక్ష అడగటం లేదు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం కొని తీరాలి. ఇప్పుడిప్పుడే రైతులు ఆనందంగా ఉంటున్న సమయంలో కేంద్రం పిడుగులాంటి నిర్ణయం తీసుకొన్నది. రైతుల భవిష్యత్తు ఏమవుతుందోననే సీఎం కేసీఆర్ ఉద్యమబాట పట్టారు.
– మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే. లేకపోతే కేంద్రానికి రైతుల ఉసురు తగులుతుంది. రైతులు ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడూ రైతుల వెంటే ఉంటారు. ఇతర రాష్ర్టాల్లో రెండు పంటలు కొనుగోలు చేసిన మాదిరిగానే తెలంగాణలో కూడా కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనాలి.
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్ర సర్కారు సాగు అనుకూల విధానాలతో రైతులందరూ సంతోషంగా ఉన్నరు. ఈ సమయంలో మోదీ సర్కారు యాసంగి ధాన్యాన్ని కొనబోమంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. ఇక్కడి బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి రైతులపై ప్రేమ ఉంటే వడ్లు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలి. కేంద్రం ధాన్యం కొనకపోతే రైతుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం.
– మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టాలని కేంద్రం చూస్తున్నది. రా రైస్ మాత్రమే తీసుకొంటామని, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కొర్రీలు పెట్టడం ఇక్కడి రైతులను గోస పెట్టేందుకే. రాష్ర్టాన్ని సాధించి ప్రపంచానికే పోరాట పాఠాలు చెప్పిన కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచడం పెద్ద విషయం కాదు. తెలంగాణ ఉద్యమ వేడిని మరోసారి కేంద్రానికి చూపుతాం. యాసంగి వడ్లు కొనేదాకా పోరాడుతాం.
– మంత్రి కొప్పుల ఈశ్వర్