హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్‌గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేశబోయిన రమ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు, సర్వీస్ నియమావళి, పదోన్నతులు, భద్రత, ప్రభుత్వంలో విలీనం తదితర అంశాలు ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగులు హకుల కోసం నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు. కార్మికులు మనోవేదనకు లోనై ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అమూల్యమైన జీవితాలను బలి చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.