Gaddar | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రజాగాయకుడు గద్దర్‌కు శాసనసభ, ప్రభుత్వం నివాళులర్పించింది. గద్దర్ మరణ వార్త తెలియగానే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజా గాయకుడు, అందరికి ఆప్తుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణానికి శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ పాటకు ప్రపంచ వ్యాప్త కీర్తి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌గా ప్రసిద్ద పొందిన గుమ్మడి విఠల్ మరణించడం యావత్ తెలంగాణ ప్రజలకు దిగ్బ్రాంతి, దుఃఖాన్ని కలిగించిందన్నారు.
`ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన ఆయన విప్లవోద్యమాల్లో కీలక పాత్ర పోషించి, ఎన్నో పాటలతో ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన కళాకారులు గద్దర్. ఆయన లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది` అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో కలిసి వేదికలు పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. తమలో గద్దర్ ఉత్సాహాన్ని నింపారని, ఆయన అద్భుతమైన కళాకారుడని, ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రజాకళలు వర్ధిల్లిన్నంత కాలం, ప్రజల్లో జానపదం, జనపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మృతికి రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున నివాళి అర్పిస్తున్నామన్నారు. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నామని, శోకార్తులైన వారి కుటుంబానికి, ఆయన అభిమానులకు, మిత్రులకు మనో దైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని దేవుడు కల్పించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.