హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బిటన్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రిని సోమవారం పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సచివాలయంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో జరిపిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లేకుంటే ఆ ప్రాజెక్టుల పనులు పూర్తికాబోవని ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులకు నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూయ (సీతక), ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.