హైదరాబాద్, జనవరి 10 (నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్రం స్టార్టప్‌లకు కేరాఫ్‌గా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ఆరిక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరిక్ట్ ఇన్నోవేషన్ హబ్‌తో కొత్తగా 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఐటీ సాధించిన విప్లవాత్మక అభివృద్ధి కారణంగా రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఐటీ వార్షిక ఎగుమతులు 30 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే 6 వేల స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ అంటే టాలెంట్, టెక్, ఇన్నోవేషన్, స్టార్టప్స్ సిటీ అని అభివర్ణించారు.
రియల్టీలోకి 11 బి.డాలర్లు
బెంగళూరు, జనవరి 10: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల హవా కొనసాగుతున్నది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. 2024లో 11.4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ సీబీఆర్ఈ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ల వాటా 44 శాతంగా ఉండగా, ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడిదారుల వాటా 36 శాతం, కార్పొరేషన్లు 11%, రిట్స్ 4%గా ఉన్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 54 శాతం ఎగబాకాయని పేర్కొంది. సింగపూర్, అమెరికా, కెనడాల నుంచి 25 శాతం పెట్టుబడులు వచ్చాయి.