హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది (2024-25) కొత్తగా లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 67,500 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు 18 వేల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారని చెప్పారు. వర్షాలు ప్రారంభంకాగానే రైతులకు మొక్కలను అందజేస్తామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుపై బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్లో ఆయన సమీక్ష నిర్వహించారు.
రైతులకు అందుబాటులో ఉండాలని, ఆయిల్‌పామ్ సాగుపై ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం 2.03 లక్షల ఎకరాలకు చేరుకున్నదని, ఇందులో 1.56 లక్షల ఎకరాలు 2021-22 నుంచే సాగువుతున్నదని వివరించారు. ఈ ఏడాది కూడా లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని, అవసరమైన మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.