హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మద్యం తాగి వాహనాలను నడిపేవారిని పట్టుకునేందుకు నిర్వహించే డ్రం కెన్ డ్రైవ్‌లో పోలీసులు బ్రీత్ అనలైజర్లను వాడుతుంటారు. వీటిని నోట్లో పెట్టి గాలి ఊదగానే అతడు మద్యం తాగిందీ, లేనిదీ.. తాగితే ఎంత మోతాదులో తాగిందీ తెలిసిపోతుంది. ఇప్పుడిదే తరహాలో డ్రగ్ టెస్టింగ్ కిట్స్‌ను కూడా అం దుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
రా ష్ట్రంలో డ్రగ్ నిర్మూలనకు తీసుకోబోయే చర్యలను వివరిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ర్టా న్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, అందుకు కావాల్సిన వనరులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు చెప్పారు. గ్రేహౌం డ్స్, ఆక్టోపస్ తరహాలో టీనాబ్కు ఓ ప్రత్యేకత ఉండాలని సీఎం చెప్పినట్టు తెలిపారు. విద్యా సంస్థలు, సినిమా, ఐటీ రంగం, బార్, పబ్, రిసార్ట్‌లలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంద ని, వాటిపై దృష్టిసారిస్తున్నామని వివరించారు.
విద్యాసంస్థల్లో కమిటీలు
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో యాంటీ డ్రగ్ కమిటీలు(ఏడీసీఎస్) ఏర్పాటు చేసి ఫ్యాకల్టీ, పేరెంట్స్, స్టూడెంట్, నాన్ టీచింగ్ స్టాప్, ఎన్టీవో, కౌన్సిలర్, డీఅడిక్షన్ నిపుణులు, హాస్టల్ వార్డెన్, పోలీసులతోపాటు జిల్లా పరిపాలన యంత్రాంగం అందులో సభ్యులుగా ఉం డేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కమిటీలు ఎక్కడైనా డ్రగ్స్ వాడినట్టు గుర్తిస్తే స్థానిక పోలీసులకు, హెల్ప్‌లైన్ నంబర్ 87126 71111, ఈమెయిల్: tsnab-hyd@tspolice.gov. in ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. అథెట్లకు నిర్వహించే డ్రగ్స్ టెస్టులానే టెస్టింగ్ కిట్స్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
దొరికితే డీఅడిక్షన్ సెంటర్‌కే
డ్రగ్స్ తీసుకున్నవారు అరెస్టుల నుంచి త ప్పించుకోలేరని సందీప్ శాండిల్య హెచ్చరించారు. దొరికినవారు డీఅడిక్షన్ క్యాంపుల్లో చేరాల్సిందేనని చెప్పారు. బ్రీత్ అనలైజర్స్ పరీక్ష మాదరిగానే డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తామని, ఇం దుకోసం పోర్టబుల్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. లాలాజలంతో చేసే డ్రగ్ టెస్ట్ అతి తక్కువ మోతాదును కూడా గుర్తిస్తుందని తెలిపారు. డ్రగ్స్‌పై సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని పేర్కొన్నారు. కొరియర్ కంపెనీలు, ట్సాన్స్పోర్ట్ కంపెనీలు, కార్ రెంటల్ కంపెనీలు, సెల్ఫ్‌డ్రైవ్ కార్లతోపాటు సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంటుందని చెప్పారు. డ్రగ్ కంట్రోల్ అండ్ ఎక్సైజ్ విభాగం, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆరోగ్యశాఖ, ఎన్టీవోలతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సందీప్ శాండిల్య వివరించారు.