హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 76, రంగారెడ్డి జిల్లాలో 24, హన్మకొండలో 15, నల్లగొండలో 11 కేసులు వెలుగు చూశాయని తెలిపింది. 184 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 3,887 మంది చికిత్స పొందుతున్నారని వివరించింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రిస్క్ దేశాల నుంచి గురువారం 312 మంది ప్రయాణికులు వచ్చారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ వచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా గురువారం రికార్డుస్థాయిలో 3.57 లక్షల కొవిడ్ టీకాలు వేశారు. దీంతో మొత్తం టీకాల సంఖ్య 4.02 కోట్లుగా నమోదైంది. రాష్ట్రంలో 57.80 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
టీకాల పంపిణీ 4 కోట్ల మైలురాయిని దాటడం సంతోషం. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఈ విజయం సాధ్యమైంది. ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు, వైద్యసిబ్బందికి అభినందనలు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంలో, వివిధ శాఖల మధ్య సమన్వయం కల్పించటంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన కృషి మరువలేనిది. మరో నెల రోజుల్లో మరో కోటి డోసులు వేస్తాం.
–సీఎస్ సోమేశ్‌కుమార్