నమస్తే నెట్వర్క్, నవంబర్ 19: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్‌లతోపాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, దళితబంధు సాధన సమితి సభ్యులను సైతం నిర్బంధించారు. ఆయా నేతల ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తాయని, పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచ్‌లు నిలదీస్తారని, లగచర్ల ఘటనపై గిరిజన సంఘం నాయకులు అడ్డుకుంటారని, రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై విద్యార్థి సంఘం నాయకులు గొంతెత్తుతారని, దళితబంధు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు రచ్చ చేస్తారనే అనుమానంతో ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్వీ, సీఐటీయూ, డీవైఎఫ్ఐ సంఘం నాయకులు, మాజీ సర్పంచ్‌లు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, దళితబంధు సాధన సమితి ఉపాధ్యక్షుడు వేమునూరి జకయ్య, లంబడా హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు వెంకట్‌నాయక్, దళిత పోరాట హక్కుల సంఘం నాయకులు ఏలేందర్, రాచర్ల రాజేందర్ ఉన్నారు.