నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, అవినీతికి పాల్పడిన నలుగురు అధికారులను ఏసీబీ కస్టడీలోకి తీసుకొన్నది. బుధవారం ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశాల మేరకు అధికారులను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీలోకి తీసుకొన్నది. గురువారం ఈ నలుగురు అధికారులను జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలిస్తారు. కామారెడ్డి పశువుల దవాఖాన అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్యకేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌వాటర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్యాధికారి సంగు గణేశ్ నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు కస్టడీకి అప్పగించాలని పీపీ కోర్టుకు విన్నవించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వాదనలను ఏకీభవించిన కోర్టు విచారణకు అనుమతిచ్చారు. ప్రధాన నిందితులు సయ్యద్ మోయినుద్దీన్, సయ్యద్ ఇక్రముద్దీన్ విదేశాల్లో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం ఉన్నదని అధికారులు తెలిపారు. ఏజెంట్లుగా వీరిద్దరి పాత్ర కీలకంగా ఉండటంతో అరెస్టుకు రంగం సిద్ధం చేయనున్నారు. 2.10 కోట్ల దుర్వినియోగంపై నలుగురి అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకొన్న అనంతరం ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నారు. అరెస్టులు పెరిగే అవకాశం ఉన్నది.