కృష్ణా జలాల వినియోగంపై ఉత్తమ్ అంకెల గారడీ!
అంకెలను చూస్తే అదే అనిపిస్తుంది. కానీ అసలు మర్మం అక్కడే ఉన్నది. అదేమంటే శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు. ఇక్కడ నుంచి నీటిని నిల్వ చేసి విద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు అందించడమే దీని లక్ష్యం. విద్యుదుత్పత్తికి వినియోగించిన నీళ్లు లెక్కల్లోకి రావు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా ఆవిరి రూపంలో నష్టపోయిన జలాలను మాత్రమే లెక్కిస్తారు. ఇదీ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలు.
- వాటాకు మించి ఏపీ జలాల తరలింపు
- ఏపీ తక్కువే వాడిందని మంత్రి ఉత్తమ్ వత్తాసు
- సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆపసోపాలు
- శ్రీశైలం నీటి లెక్కలపై మభ్యపెట్టే యత్నం
- విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు జలాలు
- వాటినీ వినియోగాల కింద చూపే కుట్ర
- ఇరిగేషన్ అధికారుల ఎదుటే నవ్వులపాలు
- నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు
- నాగార్జునసాగర్‌కు వదిలిన జలాలనూ వినియోగ ఖాతాలో చూపుతున్న సర్కార్
- సాగర్ ఎడమ కాలువకు క్రాప్ హాలిడే
- ఏపీ కుడి కాలువ కింద పంటల సాగు
అంకెలను చూస్తే అదే అనిపిస్తుంది. కానీ అసలు మర్మం అక్కడే ఉన్నది. అదేమంటే శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు. ఇక్కడ నుంచి నీటిని నిల్వ చేసి విద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు అందించడమే దీని లక్ష్యం. విద్యుదుత్పత్తికి వినియోగించిన నీళ్లు లెక్కల్లోకి రావు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా ఆవిరి రూపంలో నష్టపోయిన జలాలను మాత్రమే లెక్కిస్తారు. ఇదీ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలు. కానీ, మంత్రి మాత్రం విద్యుత్తు వినియోగ నీటి లెక్కలను సైతం కలిపి ఎక్కువ వినియోగించామని చెప్పడమే నీటిరంగంలో మంత్రికున్న అవగాహనారాహిత్యానికి నిదర్శనం. అదీగాక వరద జలాలను ఎత్తిపోయలేక ఏపీకి వదిలి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమాత్యుడి ఆపసోపాలు దీనికి తార్కాణం. అంకెల గారడీ తప్ప మరేమీ లేదని తేలింది. సరే సాగర్‌లో వాడిన లెక్కల పరిస్థితి సైతం అంతే. వాస్తవంగా శ్రీశైలం నుంచి 34 టీఎంసీల తరలింపునకు మాత్రమే ఏపీకి హక్కులు ఉండగా, అంతకు రెట్టింపుగా 72 టీఎంసీలను తరలించుకుపోయినా తక్కువే వాడిందంటూ మంత్రి చెప్పడం కొసమెరుపు.
‘అక్టోబర్ 28 నాటికి వానకాలంలో సాగు, విద్యుత్తు వినియోగం కోసం శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ 127.57టీఎంసీలు, ఏపీ 72.23 టీఎంసీలను వాడుకున్నది. సాగర్ నుంచి తెలంగాణ 41.90 టీఎంసీలు, ఏపీ 17.20 టీఎంసీలను వినియోగించుకున్నది. ఈ లెక్కలు చూస్తే ఏపీ కన్నా తెలంగాణే కృష్ణా జలాలను అధికంగా వాడుకున్నది. నీటి వినియోగంలో బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం’
– ఇదీ సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన)
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మొత్తం కలుపుకొని 405 టీఎంసీల వినియోగ లక్ష్యంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సాగర్ నీటి అవసరాలను తీర్చేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా శ్రీశైలం డ్యామ్‌ను నిర్మించారు. అదీగాక శ్రీశైలంలో నిల్వ చేసిన నీటితో జలవిద్యుత్తును ఉత్పత్తిచేస్తూ నీటిని దిగువకు విడుదల చేయా లి. ఆ విధంగా 280 టీఎంసీలను సాగర్‌కు వదలాల్సి ఉంటుంది. అదీగాక ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే సాగర్ కుడికాలువ కింద ఉన్న కృష్ణా డెల్టా ప్రయోజనాల కోసం శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్తు ప్రాజెక్టుగా నాడు ప్రతిపాదించింది. 1969లో బచావత్ ట్రిబ్యునల్‌కు సైతం ఆ మేరకే నివేదించింది.
కేంద్ర ప్లానింగ్ కమిషన్ సైతం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే శ్రీశైలం ప్రాజెక్టుకు అనుమతులు మం జూరు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకు న్న ట్రిబ్యునల్ సైతం శ్రీశైలం ప్రాజెక్టుపై సాగునీటికి కేటాయింపులు చేయనేలేదు. ఈ మేరకు 1976లో అవార్డు ప్రకటించింది. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్తు ఉత్పాదనతోపాటు, కృష్ణా జలాలు సముద్రంలోకి వృథాగా పోకుండా క్యారీ ఓవర్ స్టోరేజీగా ఉపయోగడుతుంది కా బట్టి ఈక్విటబుల్ అప్రొప్రియేట్ సూత్రం కింద 33 టీఎంసీలు ప్రాజెక్టుకు కేటాయించింది. భవిష్యత్తులో కచ్చితమైన ఆవిరి నష్టాలను లెక్కించినప్పుడు, అందులో ఆ జలాల నూ పునఃపంపిణీ చేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ అవార్డులోనే స్పష్టంచేసింది. శ్రీశైలం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేసే జలాలను వినియోగాల కింద లెక్కగట్టరు. మొత్తంగా శ్రీశైలం డ్యామ్ ను కేవలం విద్యుత్తు ఉత్పాదక ప్రాజెక్టుగానే బచావత్ ట్రిబ్యునల్, కేంద్ర సంస్థలు సైతం పరిగణించాయి.
నిబంధనలకు విరుద్ధంగా వినియోగ లెక్కలు
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తికి వినియోగించిన నీటిని లెక్కించడం లేదు. కేవలం శ్రీశైలం రిజర్వాయర్‌పై ఏర్పా టు చేసిన ఏపీ, తెలంగాణ ఔట్లెట్ల ద్వారా మళ్లించిన జలాలను మాత్రమే లెక్కిస్తున్నది. ఇటీవల బోర్డు 21వ మీటింగ్ ఎజెండాలోనూ ఆ మేరకే వినియోగాలను పొందుపరిచింది. ఇక్కడ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని నిపుణులు సైతం తేల్చి చెప్తున్నారు.
ఇదీ అసలు లెక్క
ఎగువన జూరాలకు వచ్చిన జలాలను ఒడిసి పట్టడంలో రేవంత్ సర్కార్ తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో అక్కడి జలాలు దిగువన శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చి చేరాయి. ఆ జలాలను విద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ఇప్పటివరకు మొత్తంగా సాగర్‌కు 221 టీఎంసీలు వచ్చి చేరాయి. అందులో 116 టీఎంసీలను విద్యుదుత్పత్తి ద్వారానే దిగువకు విడుదల చేశారు. అంటే ఆ జలాలను వినియోగాల లెక్కల్లో చేర్చవద్దు. అవిపోగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇరు రాష్ర్టాలు వినియోగించుకున్న జలాలు మొత్తం 84 టీఎంసీలు. అందులో ఏపీ 72 టీఎంసీలు మళ్లించుకోగా, తెలంగాణ కల్వకుర్తి ద్వారా మళ్లించింది కేవలం 12 టీఎంసీలు మాత్రమే. అయినా మంత్రి ఉత్తమ్ మాత్రం శ్రీశైలం నుంచి 127.57 టీఎంసీలను వాడినట్టు లెక్కలు చెప్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు విడుదల చేసిన 116 టీఎంసీలనూ వినియోగ ఖాతాలో చూపుతూ అంకెల గారడీకి తెరలేపారు.
సాగర్ నీటిపైనా తప్పుడు లెక్కలు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ కింద నీటి వినియోగాలపైనా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పు డు లెక్కలనే వల్లెవేశారు. ఇక్కడా తన అజ్ఞానా న్ని మరోసారి బయటపెట్టుకున్నారు. సాగర్ నుంచి తెలంగాణ 40 టీఎంసీలను వినియోగించుకుంటున్నట్టు చెప్తున్నా.. అందులో హైదరాబాద్ తాగునీరు, ఏఎమ్మార్పీ కింద వాడినవే దాదాపు 24 టీఎంసీలు. ఎడమ కాలువ కింద వినియోగించినవి కేవలం 16 టీఎంసీలు మా త్రమే. అదే కాలువ కింద క్రాప్‌హాలిడే ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం సాగర్ కుడికాలువ ద్వారా 17 టీఎంసీలను వినియోగించింది. పంటలకు నీటిని ఇప్పటికీ అందిస్తున్నది. అయినా ఏపీ తక్కువే వాడిందంటూ మంత్రి తప్పుల లెక్కలు చెప్పుకొచ్చారు.
ఏపీ తక్కువే వాడిందని వత్తాసు
కరువు సీజన్లోనూ ఎలాంటి ఇండెంట్లు, అనుమతులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ యథేచ్ఛగా జలాలను తరలిస్తున్నది. ఇప్పటికీ కొనసాగిస్తున్నది. అయినా ఏపీ తక్కువే నీటిని వాడిందని మంత్రి ఉత్తమ్ వత్తాసు పలుకడంపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ (పీఆర్పీ), తెలుగుగంగా ప్రాజెక్టు (టీజీపీ), ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్), మల్యాల, ముచ్చమర్రి లిఫ్ట్‌లు ఉన్నాయి. వాటిలో టీజీపీకి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు మొత్తంగా 34 టీఎంసీలు మాత్రమే నీటి కేటాయింపులు ఉన్నాయి. ఆ మేరకే అదీ బోర్డు అనుమతితోనే జలాలను వినియోగించుకోవాలి.
కానీ ఏపీ మాత్రం శ్రీశైలానికి వరద ప్రారంభం కాగానే ఎలాంటి అనుమతుల్లేకుండానే నీటి మళ్లింపు ను షురూ చేసింది. తొలుత మల్యాల, ముచ్చుమర్రి ద్వారా ఆ తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా నీటి మళ్లింపు ప్రక్రియను ప్రారంభించింది. కరువు పరిస్థితులున్నా వెలిగొండ ప్రాజెక్టును సైతం నూతనంగా ప్రారంభించి జలాల మళ్లిం పు చేపట్టింది. మొత్తంగా ఈ సీజన్లో ఏపీ ఒక్కటే శ్రీశైలం నుంచి 72 టీఎంసీలకు పైగా జలాలను మళ్లించింది. అంటే కోటాకు మించి అదనంగా 38 టీఎంసీలను మళ్లించింది. కానీ ఏపీయే తక్కువ వాడిందని అమాత్యుడు వత్తాసు పలుకడంపై నీటిరంగనిపుణులు సైతం నవ్వుకుంటున్నారు.
ఎత్తిపోయలేని వైఫల్యం.. నెటిజన్ల ఆగ్రహం
మంత్రి ఉత్తమ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుపై నెటిజన్లు, నీటిరంగ నిపుణులు, తెలంగాణవాదులు నిప్పులు చెరుగుతున్నారు. జూరాల వద్ద నీటిని ఎత్తిపోయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఘోరంగా విఫలమైంది. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తోపాటు, ప్రాజెక్టు ఆయకట్టుకు క్రాప్‌హాలిడే ప్రకటించింది. అదీగాక శ్రీశైలం నుంచి జలాలను మళ్లించనేలేదు. కల్వకుర్తి ఆయకట్టును పడావు పెట్టింది. మరోవైపు వాటాకు మించి ఏపీ జలాలను తరలించుకుపోవడంతోపాటు, 700 కి.మీ. ఆవలనున్న కుప్పం వరకు జలాలను తీసుకుపోయింది. ఏపీ నీటి దోపిడీకి రేవంత్ సర్కారే ఇలా బాసటగా నిలిచింది. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఆపసోపాలు పడుతున్నారు. బీఆర్ఎస్పైనే నిం దలు మోపేందుకు యత్నిస్తున్నారు. తాజాగా మంత్రి పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణను కరువు బారిన పడేసిన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ వివరాలు
పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం : 215
జూన్1 (నీటి సంవత్సరం ప్రారంభం) రోజున : 39
ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం : 55
ఈ సీజన్లో ప్రాజెక్టుకు వచ్చిన వరద : 221
విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వాడినవి : 116
రాష్ర్టాల వినియోగాలు : 84
అందులో తెలంగాణ వాడింది : 12
ఏపీ మళ్లించింది : 72
(నోట్: విద్యుదుత్పత్తి ద్వారా దిగువన సాగర్‌కు వదిలిన జలాలనూ వినియోగ ఖాతాలో చూపుతున్న కాంగ్రెస్ సర్కార్. ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధం)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

