హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గత నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలని, నాలుగు వారాల వ్యవధిలో విచారణ షెడ్యూల్‌ను ప్రకటించాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఆ వివరాలను కోర్టు రిజిస్ట్రీకి అందజేయాలని స్పష్టంచేసింది. ఈ తీర్పును సవాలుచేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదంటూ ఊహాజనిత అంశాలతో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మహేశ్వర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారని అసెంబ్లీ కార్యదర్శి తన అప్పీలులో పేరొన్నారు. వారిచ్చిన పిటిషన్లపై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కోర్టుకు వచ్చారని తెలిపారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం స్పీకర్ ఓ విధానం ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని వివరించారు. తమ వాదనలను పరిగణలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అప్పీళ్లపై విచారణ పూర్తయ్యేదాకా సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేయాలని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత అప్పీళ్లలో నిర్ణీత కాలవ్యవధిలో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించే పరిధి ఈ కోర్టుకు ఉందా? లేదా అన్నది తేల్చాల్సి ఉన్నదని పేరొంది. దీనిపై ఈ నెల 24న తుది విచారణ చేపడతామని, ఈలోగా ఏవైనా చర్యలు తీసుకుంటున్నట్టయితే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఇందులో ప్రతివాదులైన పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఏ మహేశ్వర్‌రెడ్డితోపాటు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీచేస్తూ విచారణను 24కు వాయిదా వేసింది.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అంతిమ నిర్ణయం కమిషన్‌దేనని టీజీపీఎస్సీ గురువారం హైకోర్టుకు నివేదించింది. నోటిఫికేషన్ రద్దు, కొత్త నోటిఫికేషన్ జారీ, రిజర్వేషన్ల కల్పనలకు సంబంధించి కమిషన్ తీసుకున్న నిర్ణయాలే అంతిమమని పేరొంది. గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీచేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. త్వరలో మెయిన్ పరీక్షలు జరగనున్నందున ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేరొన్నారు. వాదనలు పూర్తికాకపోవడంతో న్యాయమూ ర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా బాలానగర్ మండ లం హస్మత్‌పేట హరిజనబస్తీ వాసులకు తహసీల్దార్ జారీచేసిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాలతో, బస్తీవాసుల వాదన విని చట్టప్రకారం ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలున్నాయని, వాటిని తొలగించాలంటూ ఆగస్టు 21న తహసీల్దార్ జారీచేసిన నోటీసులను రద్దుచేయాలని, కూల్చివేతలు చేపట్టకుండా హైడ్రాకు ఆదేశాలు జారీ చేయాలంటూ హస్మత్‌పేట హరిజనబస్తీకి చెందిన మల్లయ్య మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీ టిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. తహసిసీల్దార్ జారీచేసిన నోటీసులను రద్దు చేస్తూ, చట్ట నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టవచ్చంటూ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.