Telangana Cabinet : అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ప్రభ్వుత్వం అమోదం తెలిపింది. విద్వేష పూరిత ప్రసంగాల నిరోధక బిల్లు, గిగ్ కార్మికుల సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలానే.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు ప్రభుత్వం ఒకే చెప్పింది.
తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు, కుల గణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పన కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.
2. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం రూపొందించిన “తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ , సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026” బిల్లును ఆమోదించిన కేబినెట్. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం.. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.
3. హైదరాబాద్‌లో ప్రస్తుతం 69 కిలోమీటర్ల విస్తరించిన మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రుణభారం సహా మొత్తం రూ.15 వేల కోట్లను ఎల్ అండ్ టీకి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు అప్పగించింది. HMRL ను నోడల్ ఏజెన్సీ గా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
4. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదుల పై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు, హత్యల నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
5. రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేశారు. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను కేబినెట్ చర్చించింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది.
6. విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. మంత్రివర్గం ఉప సంఘం సభ్యులుగా దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఎంపికయ్యారు.
7. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు ఏది తక్కువైతే ఆ మొత్తం వేతనాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రుల మద్దతు బిల్లును ఆమోదించిన క్యాబినెట్.