హరేకృష్ణ ఫౌండేషన్ సేవలు అమోఘం
సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించిన మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19 హైదరాబాద్ సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ధార్మిక సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ సమీపంలోని కోడూరులో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ అధ్యక్షతన శనివారం జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోడూరులో హరేకృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అధునాతన కేంద్రీకృత వంటశాల (సెంట్రలైజ్డ్ కిచెన్)ను అరబిందో ఫార్మా డైరెక్టర్ ఎం మదన్‌మోహన్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘స్వాస్థ్య ఆహార’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడం అభినందనీయమన్నారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (హెచ్‌కేఎంసీఎఫ్) ఆధ్వర్యంలో వైద్యశాలలు నిర్వహించడం, మార్కెట్ యార్డుల్లో ఉచిత ఆహారాన్ని అందించడం గొప్పవిషయమని కొనియాడారు. ప్రభుత్వ సహకారంతో అవసరమైన వారికి ఆహారాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం సత్యగౌర ప్రభూజీ మాట్లాడుతూ.. నూతన వంటశాల నుంచి స్వాస్థ్య ఆహార కార్యక్రమం ద్వారా 15 వేల మంది ప్రభుత్వ బడి పిల్లలకు అల్పాహారం, అన్నపూర్ణ పథకం ద్వారా 5 వేల మందికి మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మహబూబ్‌నగర్ జిల్లా చుట్టుపక్కల 15 వేల మంది ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు ఆహారం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్ వెంకటరావు, జెడ్పీటీసీ పుల్లూరు వెంకటేశ్వరమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీ రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ.. వంటశాల ప్రత్యేకత
15 నిమిషాల్లో వెయ్యిమందికి అన్నం వండొచ్చని, రెండు గంటల్లో సుమారు 5 వేల మందికి రుచికరమైన సాంబార్‌ను తయారు చేయొచ్చు. బయోగ్యాస్‌ను కూడా సమర్థంగా వినియోగించుకొనే వీలున్నది. వంట కోసం ఉపయోగించే నీటిని ఇక్కడే ఆర్వో ప్లాంట్‌లో శుద్ధిచేస్తారు. వ్యర్థాల కోసం బాయిలర్ సైతం ఏర్పాటుచేశారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయడం ఈ వంటశాల విశిష్టత.