కమలాపూర్, మే 20 : వ్యవసాయభూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్, ధరణి ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం హనుమకొండ జిల్లా కన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాములపల్లికి చెందిన కసరబోయిన రాజయ్య పేరటి ఏడు ఎకరాల వ్యవసాయభూమి ఉంది. ఇందులో మూడు ఎకరాల రెండు గుంటలను కొడుకు గోపాల్ పేర గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఈ నెల 9న మీసేవలో స్లాట్ బుక్ బుక్ చేశాడు.
10వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గోపాల్ కుటుంబసభ్యులతో కలిసి తహసీల్ కార్యాలయానికి వెళ్లగా, ఫైల్ చూడకుండానే తర్వాత రమ్మని పంపించివేశారు. తిరిగి 18వ తేదీన వెళ్లగా రూ.6వేలు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పడంతో చివరికి ఐదువేలకు ఒప్పందం చేసుకుని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం తహసీల్ కార్యాలయంలో గోపాల్ నుంచి తహసీల్దార్ మాధవి రూ. 4వేలు, ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.వెయ్యి తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.