హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి జీ చిన్నారెడ్డి ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పదేపదే విమర్శలు చేస్తున్నారని, దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా దృష్టిలో ఉంచుకుని ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంతకాలంగా తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో దూకుడు రాజకీయాలు చేస్తున్నారని, రెడ్డి సామాజికవర్గం నేతలను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. మిర్యాలగూడెం, వరంగల్లో జరిగిన బీసీ సభల్లో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ సామాజికవర్గం టీపీసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈనెల 5న మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఈనెల12లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేరొంది. అయితే నోటీసులకు మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.