ఖైరతాబాద్, ఆగస్టు 4: ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న)కు నిరుద్యోగుల నిరసన సెగ తగిలింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా డీఎస్సీ అభ్యర్థు లు ఘెరావ్ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో తమకు అన్యాయం జరిగిందంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి, తమ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అభ్యర్థులు పెద్దఎత్తున స్టేజీ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి, తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో తీన్మార్ మల్లన్న విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. డీ ఎస్సీ అభ్యర్థులకు సమాధానం చెప్పకుండానే తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడు తూ.. ప్రభుత్వం సాధారణ డీఎస్సీతో పాటు డీఎస్సీ ఎస్జీటీ 2024 స్పోర్ట్స్ కోటాలో సైతం నియామకాలు చేపట్టాల్సి ఉండగా, అలసత్వంతో వాటి ఫలితాలే విడుదల చేయలేదని చెప్పారు. పట్టభద్రుల ఓట్లతో గెలిచిన తీన్మార్ మల్లన్న.. నిరుద్యోగుల గురించి ఎందుకు స్పందించడం ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.