హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/ మేడ్చల్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపడు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయానికి నిరసన తెలిపేందుకు వెళ్లారు. లోపలికి వెళ్లే క్రమంలో కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి క్యూ న్యూస్ సిబ్బంది భౌతికదాడులకు దిగారు. దీంతో జాగృతి కార్యకర్తలు ప్రతిదాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పరస్పర దాడుల్లో ఆఫీసు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న గన్‌మెన్ మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత నేరుగా జాగృతి కార్యకర్తలపై తుపాకులు ఎక్కుపెట్టారు. వరసగా 6 రౌండ్లు కాల్పులు జరపగా సాయి అనే జాగృతి కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన చేతి నుంచి బుల్లెట్ వెళ్లినట్టు వైద్యులు గుర్తించారని సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు క్యూ న్యూస్ కార్యాలయాన్ని పరిశీలించి ఎవరికీ గాయాలు కాలేదని ప్రకటించారు.
మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయండి : కవిత
ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని, తక్షణం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాడ్ చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన మల్లన్నపై తక్షణం చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం గుత్తా నివాసంలో ఆయనను కలిసి నవీన్‌పై ఫిర్యాదు లేఖతోపాటు తనపై ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను అందజేశారు. అనంతరం ఆమె డీజీపీ కార్యాలయానికి వెళ్లి అదనపు ఐజీ రమణకుమార్‌కు ఫిర్యాదు కాపీని అందించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ చైర్మన్‌కు ఉన్న విచక్షణాధికారాలను ఉపయోగించి తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలను శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లోనూ పోలీసులు, నాయకుల గన్మెన్లు ఏ ఒక రోజు కూడా కాల్పులు జరిపిన దాఖలాలు లేవని చెప్పారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. వాళ్లు దాడి చేస్తేనే తమ వాళ్లు ప్రతిదాడి చేశారని తెలిపారు.
సీఎం ఎందుకు స్పందించడం లేదు?
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఇద్దరు మహి ళా జర్నలిస్టులను అరెస్టు చేశారని.. తనపై తీన్మార్ మల్లన్న అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినా సీఎం ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. సీఎం కుటుంబ సభ్యులపై ఒకతీరు.. తెలంగాణ ఆడబిడ్డనైన తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారిపై మరోలా వ్యవహరిస్తారా? అని నిలదీశారు. మల్లన్నపై సీఎం చర్యలు తీసుకోకపోతే ఆ వ్యాఖ్యల వెనుక ఆయన ఉన్నారని భావించాల్సి వస్తుందని చెప్పారు. కాల్పుల ఘటనపై సీఎం, డీజీపీ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. తాను ఏడాదిన్నరగా బీసీల కోసం ఉద్యమిస్తున్నానని, ఏ ఒకరోజు కూడా తాను తీన్మార్ మల్లన్నను ఒకమాట కూడా అనలేదని చెప్పారు. జాగృతి కార్యకర్తలపై తుపాకులతో కాల్పులు జరిపించింది తీన్మార్ మల్లన్ననా? ప్రభుత్వమా? అనేది తెలియాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘటనపై ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ ఆఫీస్‌కు రాలేదని, దీని వెనుక ప్రభుత్వమే ఉన్నదన్న అనుమానం కలుగుతున్నదని చెప్పారు. ఈ విషయంపై సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌లో న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు.
మల్లన్న క్షమాపణ చెప్పాలి : సిరికొండ
ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. మల్లన్న బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక మ హిళా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని కాపాడటం మన సంస్కృతి అని చెప్పారు. వ్యక్తిగత దూషణలకు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు రాజకీయాల్లో చోటు లేదని హితవు పలికారు.