హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పాత హాల్‌టికెట్ నంబర్లను స్వీకరించడంలేదు. 2023 వరకు గల హాల్‌టికెట్ నంబర్లను మాత్రమే వెబ్సైట్ స్వీకరిస్తున్నది. 2024, 2025లో జరిగిన టెట్ పరీక్ష వివరాలు స్వీకరించడంలేదు. టెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమయ్యింది. అయితే పాత హాల్‌టికెట్ నంబర్లను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంది. కొందరు అభ్యర్థులు 2025 హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే తప్పుడు హాల్‌టికెట్ నంబర్ అంటూ సమాధానం వస్తున్నది.
బీఈడీతో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన వారి వివరాల నమోదు సమయంలో బీఈడీ అర్హతతో అప్లికేషన్ స్వీకరించడంలేదని మరో అభ్యర్థి వాపోయారు. ఇక మరో అభ్యర్థి ఫీజు చెల్లించిన జర్నల్ నంబర్‌ను నమోదుచేస్తే పేమెంట్ ఐడీ రాంగ్ అని వచ్చినట్టు మరో అభ్యర్థి చెప్పారు. ఇక ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో పొరపాట్లు చేసిన వారు, తప్పుగా నమోదుచేసిన వారు టెన్షన్‌కు గురవుతున్నారు. టెట్ దరఖాస్తులను సవరించుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టెట్ తప్పనిసరి అయితే భాషోపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్ -3 నిర్వహించాలని కోరింది. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నాంపల్లిలోని హిందీ ప్రచార సభ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ మాట్లాడుతూ పెండింగ్‌లోని ఐదు డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను చెల్లించాలని కోరారు. సమావేశంలో నేతలు ఎస్ లక్ష్మీనారాయణ, ఎన్ భిక్షపతి, లక్ష్మణ్‌గౌడ్, పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.