హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఓ అభ్యర్థి ఫీజు చెల్లించే ప్రయత్నం చేయగా చెల్లింపు పూర్తికాలేదు. మరో అభ్యర్థికి 15 నిమిషాలు వేచి చూడండి అంటూ అలర్ట్ వచ్చింది. దీంతో అభ్యర్థులు టెట్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. శనివారం వరకు 6,888 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్ తెలిపారు. పేపర్-1కు 2,317, పేపర్-2కు 3,950, రెండు పేపర్లు రాసే వారు 621 చొప్పున 6,888మంది అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.