Flight Safty : దేశంలోని పౌర విమానయాన రంగం (Civil Aviation Sector) లో భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ (Parliamentary Panel) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ (Standing Committee) ఆన్ సివిల్ ఏవియేషన్ తాజాగా వెల్లడించింది. ఏడాదికాలంగా చేపట్టిన తనిఖీల్లో వాటిని గుర్తించామని, తరచూ అవే సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నది. జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 754 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా.. 377 విమానాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
ఆడిట్ చేసిన వాటిలో ఇండిగో విమానాల సంఖ్యే ఎక్కువని.. లోపాలు కూడా వాటిలోనే అధికంగా ఉన్నాయని స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఫిబ్రవరి మూడు వరకు 405 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా.. 148 ఫ్లైట్లలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నది. కొన్ని లోపాలు రిపీట్ అయ్యాయని తెలిపింది. 166 ఎయిరిండియా, 101 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో తనిఖీలు చేపట్టారు. వాటిల్లోనూ లోపాలు వెలుగు చూశాయి. దాదాపు సగం ఈ రెండు విమానయాన సంస్థలకు చెందిన వాటిల్లోనే ఉన్నాయి.
ఈ స్థాయిలో లోపాలు వెలుగు చూడటంపై కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. ఇవి ప్రయాణికుల భద్రత, సంస్థల విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది. గత ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియాపై డీజీసీఏ నిర్వహించిన ఆడిట్‌ను కూడా నివేదిక ప్రస్తావించింది. ఆ ఆడిట్లో దాదాపు 100 భద్రతాలోపాలను గుర్తించారు. అందులో 7 ఉల్లంఘనలు లెవెల్-1కి సంబంధించినవని, వాటివల్ల తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో వెంటనే వాటిని సరిచూసుకోవాలని ఎయిరిండియాకు డీజీసీఏ సూచించింది.
విమానాల మోడళ్లను బట్టి శిక్షణ విషయంలో వ్యత్యాసాలు ఉండటాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రస్తావించింది. 2025 చివరి నాటికి భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి 19 నోటీసులను విమానయాన సంస్థలకు డీజీసీఏ జారీ చేసింది. వాటిలో 9 నోటీసులు ఎయిరిండియాకే వెళ్లాయని వెల్లడించింది.