హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : సింగరేణి టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయని సాంకేతిక కమిటీ నిర్ధారించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టెండర్ల ఖరారులో కచ్చితమైన నిబంధనలు పాటించలేదని, బోర్డుకు ఉన్న స్వయంప్రతిపత్తి హోదాను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా నిబంధంనలు ఉల్లంఘించారని కమిటీ గుర్తించినట్టు సమాచారం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులను కూడా ఇష్టానుసారంగా ఖర్చు చేశారని, ఉద్దేశించిన లక్ష్యం కోసం నిధుల వినియోగం జరగలేదని తేల్చినట్టు తెలుస్తున్నది. స్థానిక ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం కోసం ఉపయోగించాల్సిన సీఎస్ఆర్ నిధులను దారి మళ్లించి దుబారా చేశారని గుర్తించినట్టు సమాచారం. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల అవకతవకలపై విచారణ జరిపేందుకు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ వేసిన సాంకేతిక కమిటీ ప్రాథమిక నివేదికను అందజేసినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి.
ఈ కమిటీలోని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన్ శుక్లా, డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు బృందం సింగరేణిలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. సింగరేణి కేంద్ర కార్యాలయంలో టెండర్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించింది. నైని కోల్ బ్లాక్ మైన్ డెవలపర్, ఆపరేటర్ (ఎండీవో) నియామకం కోసం నిరుడు నవంబర్ 28న జారీ చేసిన టెండర్ ఆహ్వాన నోటీసును విశ్లేషించింది. కొత్తగా చేర్చిన నిబంధనలు, టెండర్ రద్దుకు కారణాలేంటి? అనే అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి వివరాలు సేకరించినట్టు తెలిసింది. సింగరేణి కొత్తగా రూపొందించి అమలుచేసిన టెండర్ నిబంధనకు, ఇతర కంపెనీలు అనుసరిస్తున్న నిబంధనలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను పోల్చారని సమాచారం.
నైని టెండర్ల నిబంధనల్లో అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారించినట్టు తెలిసింది. సైట్ విజిట్ తప్పని సరి అనే నిబంధన టెండర్ ప్రక్రియను తీవ్ర ప్రభావితం చేసిందని సాంకేతిక కమిటీ నిర్ధారించినట్టు సమాచారం. సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిని అనుమతిస్తే సరిపోతుందని, ‘నేను సైట్ చూశాను, అకడి పరిస్థితులు నాకు తెలుసు’ అని బిడ్డర్ సంతకం చేసి ఇస్తే సరిపోతుందని, కానీ సింగరేణి ఒక ప్రభుత్వ రంగ సంస్థే అయినా, కేంద్ర సంస్థల కంటే భిన్నమైన నియమాన్ని పాటించడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధికారులు స్వయంగా సంతకం చేసి సర్టిఫికెట్ ఇవ్వాలనే నిబంధన ఒక రకమైన గేట్ కీపింగ్లాగా పని చేసిందని నివేదికలో పేర్కొన్నారట! అధికారులు ఎవరికి సర్టిఫికెట్ ఇస్తే వారే టెండర్ వేయడానికి అర్హులవుతారని, వందలాది ఇతర కంపెనీలు సెల్ఫ్ డిక్లరేషన్‌ను అనుమతిస్తున్నప్పుడు, ఇకడ మాత్రమే సర్టిఫికెట్ అడగడంపై వ్యక్తిగత లబ్ధి పొందే దురుద్దేశం ఉన్నదని కమిటీ నిర్ధారించినట్టు సమాచారం.
సంస్థకు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల వినియోగం, దుర్వినియోగంపై కమిటీ విచారణ చేసినట్టు తెలిసింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఈవెంట్‌కు సింగరేణికి సంబంధించిన సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయడాన్ని సాంకేతిక కమిటీ తప్పుబట్టినట్టు సమాచారం. బోర్డుకు ఉన్న అటానమస్ అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఉద్దేశపూర్వకంగా రూ.10 కోట్లు సింగరేణి సీఎస్ఆర్ సొమ్మును దుబారా చేశారని, దీనికి సింగరేణి అప్పటి సీఎండీ బాధ్యత వహించాల్సి ఉంటుందని నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది.
సింగరేణితో ప్రభావితమయ్యే స్థానిక ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులను ప్రైవేట్ ఈవెంట్లకు కేటాయించారని, ఇది క్షమించరాని తప్పిదమని కమిటీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నిధుల మళ్లింపు వెనుక ఉన్న ఉన్నతాధికారుల పాత్రపై విచారణ జరపాలని సూచించినట్టు చెప్తున్నారు. కమిటీ నివేదిక సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, మంత్రి భట్టి విక్రమార్కను ఇరుకున పెట్టిందన్న ప్రచారం జరుగుతున్నది. కేంద్రం తలుచుకుంటే సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.