KCR | హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ): భారీ ప్రాజెక్టు, తెలంగాణకు అత్యావశ్యకమైనప్రాజెక్టు కాబట్టే ‘కాళేశ్వరం’పై నాటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని, వ్యాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ సూచనలను పరిగణలోకి తీసుకుని, ఎక్స్పర్ట్ కమిటీల రిపోర్టుల మేరకే రీడిజైన్, బరాజ్‌ల నిర్మాణ నిర్ణయం కొనసాగిందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వివరించారు. ప్రాజెక్టుపై తీసుకున్న ప్రతీ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదమున్నదని వెల్లడించారు. నిర్మాణ నాణ్యత నిరంతర పరిశీలన కోసం ప్రాజెక్టు సైట్ వద్దనే క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మేరకు కాళేశ్వరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు నివేదించారు. బీఆర్కే భవన్లో బుధవారం ఉదయం నిర్వహించిన కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్‌ను ముఖాముఖిగా విచారించారు.
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్ అవసరం? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ నిర్ణయం ఎవరిది? ఎవరు నిర్ణయించారు? నిర్మించాల్సిన ఆవశ్యకత? నిర్మాణం కోసం కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ, తిరిగి చెల్లింపులు, బరాజ్‌ల లోకేషన్ల మార్పు, నీటి నిల్వకు సంబంధించిన అంశాలపై దాదాపు 18 ప్రశ్నలను సంధించినట్టు సమాచారం. ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చినట్టు తెలిసింది. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, 3 బరాజ్‌ల నిర్మాణ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించినట్టు సమాచారం. అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, నీటి కోసం తెలంగాణ రైతాంగం పడిన తండ్లాటను, రాష్ట్ర ఏర్పాటు నాటికి నిర్మించిన ప్రాజెక్టులు, వాటి దుస్థితిని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది.
వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాజెక్టులను అధ్యయనం చేసి వాటిపై ఏవిధంగా ముందుకు పోవాలనే దానిపై సిఫార్సులు చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారని తెలిసింది. అందులో భాగంగానే వ్యాప్కోస్ ఇచ్చిన డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి (పీసీఎస్ఎస్) ప్రాజెక్టును రీ ఇంజినీరింగ్ చేశామని, అందులో మొత్తం 7 లింకులుండగా, 6 లింకులను యథావిధిగా ఉంచామని, మొదటి లింక్ తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రకు ఎంత విజ్ఞప్తి చేసినా 152 మీటర్లకు అంగీకరించకపోవడం, అదేవిధంగా అక్కడ నీటిలభ్యత లేదని ప్రాజెక్టు నిర్మాణాన్ని పునఃపరిశీలించుకోవాలని సీడబ్ల్యూసీ సూచించడం, తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి జలాలను తరలించే మార్గంలో బొగ్గుగనులు ఉండడం తదితర సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకుని మొదటి లింక్‌ను మాత్రమే మార్చాల్సి వచ్చిందని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది.
మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల అంశాలను కూడా జస్టిస్ ఘోష్‌కు వివరించినట్టు సమాచారం. ఆ తరువాత సీడబ్ల్యూసీ అనుబంధం సంస్థ, గతంలో పీసీఎస్ఎస్ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించిన అదే వ్యాప్కోస్ను ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కోరడంతోపాటు, లైడార్ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖ రాశానని వివరించినట్టు తెలిసింది. సర్వే నిర్వహించిన వ్యాప్కోస్ మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల జలాలు అందుబాటులో ఉంటాయని, అందులో తెలంగాణ అవసరాలకు 230 టీఎంసీలను వినియోగించుకునే అవకాశముంటుందని అభిప్రాయానికి వచ్చి తుమ్మిడిహట్టి బరాజ్‌ను మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని వివరించినట్టు తెలిసింది.
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణ అంశంపై విశ్రాంత ఇంజినీర్లతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశామని, అయితే మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరుకు జలాలను తరలించడం అసాధ్యమని, అక్కడ కూడా బొగ్గుగనులు, మార్గమధ్యంలో పెద్ద పట్టణాలు ఉన్న నేపథ్యంలో నదీమార్గమే శ్రేయస్కరమని భావించామని జస్టిస్ ఘోష్‌కు కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. వ్యాప్కోస్, విశ్రాంత ఇంజినీర్ల నివేదికలను, సీడబ్ల్యూసీ సూచనలను, అత్యున్నత సాంకేతిక కమిటీ ప్రతిపాదనలతోనే ప్రాజెక్టు రీడిజైన్, 3 బరాజ్‌ల నిర్మాణ నిర్ణయం జరిగిందని, ప్రభుత్వం, క్యాబినెట్ అన్నింటినీ ఆమోదించిందని వివరించినట్టు సమాచారం.
ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సర్వేలు చేయించామని, కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని, ప్రతి నిర్ణయాన్నీ నివేదికల ఆధారంగా ఇంజనీర్లు నిర్ణయాలు తీసుకున్నారని కేసీఆర్ వెల్లడించినట్టు సమాచారం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రైతాంగం ఆకాంక్షలకు అనుగుణంగా సత్వరమే నీళ్లను అందించాలనే లక్ష్యంతో భారీ ప్రాజెక్టును చేపట్టామని, నిర్మాణానికి నిధుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశామని, ప్రాజెక్టుకు సొంత ఆదాయం సమకూరే దాకా కార్పొరేషన్ రుణాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం పూచీకత్తు బాధ్యత తీసుకున్నదని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి కార్పొరేషన్ రుణాలకు పూచీకత్తు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4000 మంది ఇంజినీర్లు, ఇతర సాంకేతిక నిపుణులు పనిచేశారని జస్టిస్ ఘోష్‌కు కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. గోదావరిలో ఏటా భారీగా వరద వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని, నిరంతరం నాణ్యత పరిశీలనకు చర్యలు తీసుకున్నామని వివరించినట్టు సమాచారం. అందులో భాగంగా ప్రాజెక్టు సైట్ వద్ద ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, అందుకు సంబంధించిన పరీక్ష రిపోర్టులను కూడా తెప్పించుకోవాలని కమిషన్‌ను కేసీఆర్ కోరినట్లు తెలిసింది. బరాజ్‌లలో నీళ్లు నింపాలని ఆదేశించారా? అని జస్టిస్ ఘోష్ కేసీఆర్‌ను ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చినట్టు తెలిసింది. అది సాంకేతిక అంశమని, అయితే నీటి ఎత్తిపోతల కోసమే బరాజ్‌లను నిర్మించామని, ఎత్తిపోతలకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉందో లేదో చూసుకుని, ఆ మేరకు ఇంజినీర్లే పూర్తిగా నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది.
ప్రాజెక్టు నిర్వహణపై జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా కేసీఆర్ స్పందిస్తూ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 2020లో ప్రత్యేకంగా జీవో 45ను జారీ చేసినట్టు వివరించారు. ప్రాజెక్టుల ఆపరేషన్ మాన్యువల్‌తోపాటు, నిర్వహణకు సంబంధించి ఏటా రూ. 280కోట్ల మేర పనులకు పరిపాలన అనుమతులను మంజూరు చేసే అధికారాలను కూడా ఇంజినీర్లకు కల్పించామని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారం, కీలకమైన పత్రాలతో రూపొందించిన ది లైఫ్ లైన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంట్ కాపీని కమిషన్‌కు అందజేసినట్టు సమాచారం. అందులోని ప్రతీ అంశాన్ని అంశాన్ని వివరించినట్టు తెలిసింది.