హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో టీచర్ల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ మాడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ‘17 మాడల్ స్కూళ్లలో జీరో టీచర్లు’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన సోమవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలోని 98 స్కూళ్లకు ప్రిన్సిపాళ్లు లేరు.. ఆయా పాఠశాలల్లో సీనియర్ టీచర్‌కు ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించడంతో పాటు, పీజీటీ, టీజీటీ టీచర్లు లేనిచోట అవర్లీ బేస్డ్ టీచర్లను తీసుకుంటామని తెలిపారు. ఇక ఇటీవల నిర్వహించిన బదిలీలతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరు(యూ), మెదక్ జిల్లాలోని రేగోడు మాడల్ స్కూళ్లలో టీచర్లు లేరని ఆయన పేర్కొన్నారు.