సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 19 : విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో ఉపాధ్యాయ వృత్తికే కలంకం సృష్టిస్తున్నాడు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి జడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్ తరుచూ విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బద్దెనపల్లి పాఠశాలకు 2022లో వచ్చిన అతను గతంలో పలు మార్లు బాలికలపై అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు మందలించారు. దీంతో వారికి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయినా, తన వక్రబుద్ధి మానుకోలేదు. ఓ విద్యార్థినిని ‘ఏ పౌడర్ వేసుకుంటున్నావ్..’ తదితర వెకిలి చేష్టలు, మాటలతో ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గురువారం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని మందలించారు. ఈ విషయంపై ఎంఈవో రాజునాయక్ను వివరణ కోరగా.. విచారణ జరిపి, డీఈవోకు రిపోర్ట్ చేస్తానని తెలిపారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు.