TS TET | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. టెట్ నిర్వహణకు గతంలో జారీచేసిన జీవోలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. దీంతో ఒకట్రెండు రోజులు ఆలస్యంగా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి. టెట్ నిర్వహణకు గతంలో రాష్ట్రప్రభుత్వం జీవో -36ను జారీచేసింది. అయితే ఈ జీవోలో 1-8వ తరగతుల బోధనకు కాబోయే టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొన్నది. అయితే స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎంల పదోన్నతులకు టెట్ తప్పనిసరిచేస్తూ ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పదోన్నతులు కల్పించాలంటే టెట్ అర్హత అడ్డంకిగా మారింది. తాజాగా నిర్వహించే టెట్‌లో తమకు అవకాశం కల్పించాలని టీచర్లు కోరుతున్నారు. దీంతో టెట్ నిబంధనలు మార్చాల్సి ఉన్నది. దీంతో పాటు టెట్‌ను ఏటా డిసెంబర్, జూన్‌లో నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. జీవో -36లో టెట్‌ను ఏటా ఒకసారి నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనిని కూడా సవరించాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే టెట్ ఇన్ఫర్మేషన్ బులిటిన్ విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. డీఎస్సీ కంటే ముందే టెట్ జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు ప్రయోజనం కలుగనున్నది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఎస్సీ రాతపరీక్షలను జులై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు గడువు జూన్ 20 వరకు ఉన్నది.