శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 1 : ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులను కులం పేరుతో అవమానించిన టీచర్లను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం శంషాబాద్ మండలం పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్‌ను వెంకటయ్య సందర్శించారు. హాస్టల్లోని వాష్‌రూమ్‌లు, డైనింగ్ హాల్‌తోపాటు భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థినులను అవమానించిన టీచర్ ప్రశాంతి, ఎస్వో మాధవి, ఏఎన్ఎం శాంతమ్మలను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాబోధన సరిగా లేదని విద్యార్థులు తన దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించడంతోపాటు వారికి నాణ్యమైన విద్య, భోజనం అందించాలని ఆదేశించారు. పిల్లలకు ప్రతిరోజూ ఫిల్టర్ నీళ్లు ఇవ్వాలని, మూత్రశాలలు పెంచాలని సూచించారు. అనంతరం డీఈవో, ఆర్డీ వో, ఎస్సీ డీడీలతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులతోపాటు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ తదితరులు ఉన్నారు.
అంగన్వాడీల్లో అదనపు సిబ్బందిని నియమించాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లో జనాభా ప్రాతిపదికన సిబ్బందిని అదనపు నియమించాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. చాలా అంగన్వాడీల్లో ఒక టీచర్, ఒక ఆయా మాత్రమే ఉండటంతో అందరికీ పోషకాహారాన్ని అం దించడం సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలవారీగా జనాభాను లెక్కించి అంగన్వాడీ కేంద్రాలను హేతుబద్ధీకరించేందుకు లేదా అదనపు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అంగన్వాడీల్లోని సిబ్బందితో పనులు చేయించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాల యాప్‌లను ఏర్పాటు చేశాయి. పిల్లలు, తల్లులు వివరాలను ఈ రెండు యాప్‌లలో అప్లోడ్ చేయాల్సి వస్తుండటంతో అంగన్వాడీల సిబ్బందిపై పనిభారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న వివరాలను సమర్పించేందుకు రెండు రకాల యాప్‌లను కాకుండా సింగిల్ యాప్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.