హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): గురుకుల సొసైటీలన్నింటికీ ఖరారు చేసిన కామన్ టైంటేబుల్‌ను మార్చాలని గురుకుల సొసైటీలకు చెందిన బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఎప్పుడు అడిగినా ఇదిగో.. అదిగో అంటూ కాలం వెల్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన కామన్ టైంటేబుల్ శాస్త్రీయంగా లేదని, విద్యార్థులపై ఒత్తిడి పెంచేదిగా ఉన్నదని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులకు అనుగుణంగా పనివేళలు సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జనరల్, బీసీ గురుకులాలు మినహా మిగతా గురుకుల సొసైటీల పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభమయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కామన్ టైం టేబుల్ జారీ చేసింది. అన్ని గురుకుల సొసైటీల్లోని పనివేళలను ఉదయం 8నుంచి రాత్రి 9గంటల వరకు మార్చింది. దీనిపై అప్పట్లోనే బోధన, బోధనేతర ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పనివేళలను మార్చుతామని ప్రభు త్వం హామీ ఇచ్చింది. కానీ ఏడాది గడిచినా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణం పనివేళలను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేయాలని హెచ్చరించారు.
జీపీవోల నియామకం ఇంకెప్పుడు? ; మూడు నెలలుగా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, జులై 13 (నమస్తే తెలంగాణ): ప్రతీ రెవెన్యూ గ్రామానికో గ్రామ పరిపాలన అధికారి(జీపీవో)ను నియమించి, ప్రజల భూసమస్యలకు పరిష్కారం చూపుతామంటూ ప్రకటించిన ప్రభుత్వం.. మూడు నెలలు గడిచినా నియామక ప్రక్రియను పూర్తి చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 10,954 మంది జీపీవో పోస్టులు మంజూరు చేస్తూ మార్చి 22న ఆర్థికశాఖ ఉత్తర్వులు, ఏప్రిల్ 1న రెవెన్యూశాఖ నోటిఫికేషన్ జారీ అయ్యాయి. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వీరి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పరీక్ష నిర్వహించగా కేవలం 3,554 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీంతో 7,400 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. 3,554 మంది జీపీవోలుగా ఎంపికై కూడా నెలరోజులు కావొస్తున్నది. అయిన్పటికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడంలేదు. మరో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్లను ఎంపిక చేసిన తర్వాతే అందరికీ కలిపి పోస్టింగ్ ఇస్తారనే చర్చ జరుగుతున్నది. ఈ ధోరణిపై ఎంపికైన జీపీవోలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులపై మండిపడుతునారు. తమ ఎంపిక పూ ర్తయినప్పుడు.. పోస్టింగ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు.