హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని గురుకులాల టైం టేబుల్ (పనివేళలను) మార్పునకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన విద్యారంగ సమస్యలపై చర్చించారు.
మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలని, ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. హైస్కూళ్లకు హెచ్ఎం పోస్టులు మంజూరుచేయాలని, పరస్పర బదిలీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.
వీటిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.