Tea Stall | సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్, ఫిబ్రవరి 21: సిరిసిల్ల మున్సిపల్ అధికారులు తీరు విమర్శలకు దారి తీస్తున్నది. ట్రేడ్ లైసెన్స్ సాకుతో గురువారం టీస్టాల్‌ను సీజ్ చేసిన అధికారులు, శుక్రవారం టీస్టాల్ డబ్బాను క్రేన్‌తో తొలగించి మున్సిపల్ భవనానికి తీసుకెళ్లారు. టీస్టాల్ తరలింపును అడ్డుకోబోయిన చిరు వ్యాపారి బత్తుల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ మున్సిపల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తాను మొదటి నుంచి కేటీఆర్‌కు అభిమానినని, అందుకే హోటల్‌కు ‘కేటీఆర్ టీ స్టాల్’ అని పేరు పెట్టుకున్నానని, కేటీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు.
కేటీఆర్ ఫొటో ఉన్నందునే అధికారులు తన హోటల్‌ను మూసివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు హోటల్ వద్దకు చేరుకుని బత్తుల శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. నిరసనలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు బొల్లి రామ్మోహన్, వెంగల శ్రీనివాస్, దార్ల సందీప్, అన్నారపు శ్రీనివాస్ తదితరులు శ్రీనివాస్‌కు భరోసా కల్పించారు. అండగా ఉన్నామని తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన సందర్భంగా బత్తుల శ్రీనివాస్ మీడియాతో ఆయన మాట్లాడుతూ “అయ్యా కలెక్టర్ సార్.. మీరు చెప్పినట్టుగానే ఫ్లెక్సీ తీయమంటే తీసేశాను. నాపై ఎందుకింత కక్షతో వ్యవహరిస్తున్నారు? గింత అన్యాయం చేస్తారా?’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. సామాన్లతో పాటు డబ్బాను తీసుకపోవడంతో నా కుటుంబం రోడ్డునపడింది.
సిరిసిల్లలో హోటల్ తొలగింపు బాధితుడు శ్రీనివాస్‌తో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. “తమ్ముడు.. శ్రీనివాస్ అధైర్యపడకు. నీ కుటుంబ బాధ్యత నాది. తొందర్లోనే వస్తా. దుకాణం కొత్తది పెట్టించి నేనే ప్రారంభిస్తా” అంటూ భరోసానిచ్చారు. కాగా, చాయ్ హోటల్ నడుపుకుంటేగానీ పూట గడవని శ్రీనివాస్ కుటుంబం ప్రభుత్వ చర్యలతో రోడ్డునపడింది.