హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. థాయిలాండ్‌కు చెందిన మిస్ వరల్డ్-72 విజేత ఓపల్ సుచాతా చుయాంగ్శ్రీ, మొదటి రన్నరప్ హస్సెట్ దేరేజే(ఇథియోపియా), రెండో రన్నరప్ మజ క్లాజ్డా(పోలాండ్), మూడో రన్నరప్ ఆరెల్ల జో అచ్ఛిమ్(మార్టినిక్) పాల్గొన్నారు. వీరిని గవర్నర్, సీఎంలు సన్మానించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పోటీల సందర్భంగా ఇక్కడ జరిగిన అనుభవాలు గుర్తుండిపోతాయని అందగత్తెలను ఉద్దేశించి అన్నారు. కాగా, అంతకుముందు రాజ్‌భవన్‌లో ఆకులతో గిరిజనులు రూపొందించిన స్వాగత వేదిక వద్ద మిస్ వరల్డ్ విజేతలు ఫొటోలు దిగారు. రాజ్‌భవన్ తేనేటి విందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మం త్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.