హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఎన్టీఆర్-చంద్రబాబు మధ్య పార్టీ గుర్తు కోసం కేసు నడిచిన సమయంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పట్ల ఇప్పుడు చంద్రబాబునాయుడు కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, ఎంపీ మల్లు రవి సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇ వ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. జడ్జిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎన్నో కీలక తీర్పులు చెప్పారని గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
తెలుగు ఎంపీలంతా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డికే మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎంపీ మల్లు రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డికి ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదని, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి ఆయనను అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో విప్ ఉండదని, అం దువల్ల స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుందని అన్నారు.