Revanth Reddy | తెలంగాణ లోగో మార్పు వివాదంలో సీఎం రేవంత్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చిత్రకారులు అనుకున్నా కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యం ఉన్న నాయకులు అని అనుకోలేదని విమర్శించారు. మీరంటే గౌరవం ఉండేదని.. కానీ చరిత్రను మార్చేసి రేపటి తరాలకు విషం నింపబోతున్నారని అనుకోలేదని అన్నారు. కాకతీయులు ఢిల్లీ రాజులను ఎదురించి భారతదేశంలో రాజకీయ చరిత్రను మార్చేసిన గొప్ప వ్యక్తులు అని కొనియాడారు. పరిపాలన సంస్కరణతో, రైతుల సంక్షేమం కోసం, బడుగువర్గాల కోసం, శ్రామికవర్గాల కోసం పోరాడినటువంటి మహోన్నత చరిత్ర కలిగిన వారని చెప్పుకొచ్చారు. శిల్పకళా చాతుర్యంలోగానీ.. పరిపాలన విధానాల్లోగాని వన్నె తెచ్చినవారని చెప్పారు. గణపతి దేవుడు కమ్మ వంశానికి చెందినప్పటికీ యాదవ మహారాణిని పెళ్లాడి.. రెండు కులాల మధ్య చైతన్యాన్ని కల్పించి.. సామాజిక విప్లవానికి కూడా పాటుబడ్డారు. అలాంటి ఔన్నత్యం కలిగిన కాకతీయ చరిత్రను వదిలేస్తారా అని ప్రశ్నించారు.
మంత్రి సీతక్కపైనా కాట్రగడ్డ ప్రసూన విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబు తీసుకొచ్చిన కడిగిన ముత్యం అని తెలిపారు. బడుగు వర్గం నుంచి ఈ రోజున మంత్రిగా మహోన్నతస్థానంలో ఉన్నారు. కానీ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం తీసివేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెనుక మీ పాత్ర ఉందని అర్థం అవుతుందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మను కాకతీయులే చంపారు అంటూ ములుగు సామ్రాజ్యం గురించి మాట్లాడేలా చేస్తున్నారని విమర్శించారు. ములుగులో కమ్మవారు లేకపోతే మీరు గెలవగలుగుతారా? అని ప్రశ్నించారు. ములుగులో కమ్మ స్త్రీగా నిలబడతా? మీరు నిలబడండి అని సవాలు చేశారు. అటు ఎస్టీ, కమ్మ కలిస్తేనే ములుగు నియోజకవర్గంలో గెలుపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మీకు చేసిన మేలు మరచిపోయి.. కాకతీయ వంశం గురించి మాట్లాడి.. కాకతీయులు క్రూరులు అని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడించడం సమంజసం కాదన్నారు.
కమ్మ వారు లేకుంటే మీరు గెలవగలరా..?@seethakkaMLA @revanth_anumula pic.twitter.com/GNVIYd8sAX
— Katragadda Prasuna Ex-MLA (@PrasunaTDP) June 2, 2024