Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో టీటీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేకపోవడంతో జూబ్లీహిల్స్లో పోటీ చేయవద్దని నిర్ణయించారు. అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అందుకే పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు భావించినట్లు సమాచారం. ఒకవేళ మద్దతివ్వాలని బీజేపీ సంప్రదిస్తే మాత్రం మద్దతివ్వాలని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇక టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చించారు. అధ్యక్షుడిని నియమించేలోపు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చేవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు.