బెల్లంపల్లి, డిసెంబర్ 24 : సింగరేణి ఆవిర్భావ దిన వేడుకలకు యాజమాన్యం అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మెస్సీ ఫుట్‌బాల్ క్రీడ, రాజీవ్ సివిల్ అభయహస్తం, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సమ్మక్క,సారక్క, రావణాసుర వధ, వీధిదీపాలు, కోల్‌బెల్ట్‌లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నా జాబ్‌మేళాలు, ప్రారంభోత్సవాలకు సింగరేణి నిధులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. సింగరేణి వేడుకలకు మాత్రం ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తొత్తుగా మారిన గుర్తింపు సంఘం దీనిపై నోరెత్తడం లేదని విమర్శించారు. తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సింగరేణి ఆవిర్భావ వేడుకలకు రూ.47 లక్షల నిధులు కేటాయించగా, ఈ ఏడాది రూ.8 లక్షలు మాత్రమే కేటాయించారని అసహనం వ్యక్తం చేశారు.