హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి 2025-26 వార్షిక బడ్జెట్లో కేవలం 8% నిధులు కేటాయించడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. శుక్రవారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇవ్వడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్ప వేరే విషయాలు మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనమండలి సాక్షిగా చెప్పారని, ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదని కాంగ్రెస్ నేతలకు తత్వం బోధ పడిందని ఎద్దేవా చేశారు. అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం, వైద్యం, విద్యారంగాల్లో తీసుకొచ్చిన మార్పులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేశాయని చెప్పారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు సరిగా లేవని పేర్కొన్నారు.
తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ ఇచ్చిన ‘జిత్నా బాగేదారి.. ఉత్నా హిస్సాదారి’ నినాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికభారం పేరిట అనేక సంక్షేమ పథకాల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట ఇచ్చారని కానీ, బడ్జెట్లో ఆ అంశాన్ని ప్రస్తావించపోవడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగించడం లేదని విమర్శించారు. రైతుభరోసా విషయంలోనూ ప్రభుత్వం మాటతప్పిందని దుయ్యబట్టారు. విద్య, వైద్య రంగాలకు సైతం సరిపడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.