Tata Madhu | సీఎం కేసీఆర్‌ను కొనే వ్యక్తి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ ఉండరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌ను లొంగ దీసుకోవడానికి పలువురు ప్రయత్నించారని గుర్తుచేశారు. పొంగులేటి గురువు వైఎస్ఆర్ కూడా టీఆర్ఎస్ను చీల్చడానికి ప్రయత్నించి విఫలమైన సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో సుఖేశ్ అని విమర్శించారు. మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్‌గా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీసీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.
మంగళవారం ఆయన ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిదిన్నరేండ్లుగా అధికార బలాన్ని ఉపయోగించుకున్న పొంగులేటి.. ఇప్పుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను కొనుగోలు చేసే స్థోమత పొంగులేటికి ఉందా? అని ప్రశ్నించారు.
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనీయకుండా చేయడానికి నువ్వేమైనా గేటు వాచ్మెన్వా? అని తాతా మధు ఎద్దేవా చేశారు. ‘2018 నుంచి నువ్వు ఏ గేటునూ తాకకుండా చేసింది మర్చిపోయావా?’ అని ప్రశ్నించారు. జిల్లాలో జలగం వెంగళరావు, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ నాగేశ్వరరావు, రజబ్అలీ, గుమ్మడి నర్సయ్య వంటి ఎంతోమంది నేతలు ఉన్నారని అన్నారు. కానీ వారెవ్వరూ పొంగులేటి మాదిరిగా అహంకారంతో మాట్లాడలేదని అన్నారు.
సీఎం కేసీఆర్‌కే కమీషన్లు ఇచ్చానంటూ చెబుతుండడం బూటకమని, ఆ మాటలన్నీ తన రాజకీయ మనుగుడ కోసం మాట్లాడినవేనని తాతా మధు అన్నారు. ఇలాంటి పొంగులేటికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక మతిభ్రమించి వ్యవహరిస్తున్న శ్రీనివాసరెడ్డికి జిల్లా ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు.
చీమలపాడు ఘటనను రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఆ సంఘటనను కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనే నీచపు ఆలోచన చేస్తున్న శ్రీనివాసరెడ్డి ప్రజాసేవకు అనర్హుడని అన్నారు. తన కూతురి వివాహానికి సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించడానికి ప్రగతిభవన్‌కు వెళ్తే కనీసం వివాహ పత్రికను కూడా తీసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అతడి స్థాయికి తగునా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు.
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన ఫొటోను మీడియా సమావేశంలో తాతా మధు ప్రదర్శించారు. ఈ ఫొటోలో ఉంది ఎవరో చెప్పాలంటూ పొంగులేటిని తాతా మధు ప్రశ్నించారు. తన ఇంటి వేడుకలకు కనీసం మంత్రి కేటీఆర్ కూడా హాజరుకాకుండా అవమానపరిచారంటూ తప్పుడు అభియోగాలు మోపడం దారుణమన్నారు. శ్రీనివాసరెడ్డి ఇంట్లో వివాహ వేడుకకు మంత్రి కేటీఆర్ హాజరైన ఫొటోలను కూడా ఎమ్మెల్సీ మధు ఈ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఇలా శ్రీనివాసరెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్సీగా, ప్రజాప్రతినిధిగా ఉన్న తాను, మాజీ ఎంపీ పొంగులేటి నిజస్వరూపాన్ని జిల్లా ప్రజలకు తెలియజేస్తానని తాతా మధు స్పష్టం చేశారు. శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన చేసిన అవినీతి చిట్టాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌పైనా అవినీతి ఆరోపణలు చేస్తున్న పొంగులేటికి కనీసం బుద్దీజ్ఞానం ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టును సైతం హేళన చేసిన పొంగులేటి.. సీతారామ ప్రాజెక్టుకు టెండర్ ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటికి మధిర నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చినా ఆ ఒక స్థానాన్నీ గెలిపించలేకపోయారని విమర్శించారు. పొంగులేటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఇతర పార్టీ నేతలు కూడా ఆయనను వారి పార్టీల్లో చేర్చుకునేందుకు సిద్ధపడడం లేదన్నారు. అందుకే ఆయన ఏ పార్టీలోనూ చేరలేకపోతున్నారని అన్నారు.
ఇప్పటికైనా పొంగులేటి తన తీరు మార్చుకోకపోతే ఆయన రాజకీయ భవిష్యత్‌కు చమరగీతం తప్పదని తాతా మధు హెచ్చరించారు. ఎస్ఆర్ గార్డెన్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎవరి అనుమతితో బ్రిడ్జి కట్టావని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కార్యకర్తలు సహింబోరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమన్వయ సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ కమర్తపు మురళి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, తెలంగాణ ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.