హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కల్తీపాలు, పాల పదార్థాలు కలకలం రేపుతున్నాయి. ఈ కల్తీ దందా డెయిరీ నిర్వాహకులను సైతం కలవరపెడుతున్నది. ఇటీవల హైదరాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో కల్తీ పాలు, పన్నీర్, పెరుగు, నెయ్యి దందాలు వెలుగుచూశాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్‌లో టాస్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి సుమారు 3,000 కిలోల కల్తీ పన్నీర్, 460 కిలోలకుపైగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న బంజారాహిల్స్, ఇతర ప్రాంతాల్లో పామాయిల్, డాల్డా, రసాయనాలు కలిపి తయారు చేసిన 460 కిలోల కల్తీ నెయ్యిని పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని వివిధ రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వ్యాపారులు తకువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో పటాన్చెరు పరిధిలోని ఓ పాల డెయిరీలో కల్తీ పెరుగు, పన్నీరు, పర్వతాపూర్‌లో 110 లీటర్ల కల్తీ పాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పటాన్‌చెరులోని మరో డెయిరీలో కల్తీ పాలు, పన్నీరు, బట్టర్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో కల్తీ పాలు, పాల పదార్థాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పాడి పరిశ్రమ సంస్థ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి సూచించారు. బ్రాండెడ్ కంపెనీల పాలు, పాలపదార్థాల్లో కల్తీ జరగడానికి అవకాశాలుండవని స్పష్టం చేశారు. విజయ డెయిరీ పేరుతో ఎవరైనా కల్తీ పాలు, పాల పదార్థాలు తయారీ చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తే ల్యాబ్‌లలో పరీక్షిస్తామని వెల్లడించారు. ఇటీవల విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందగానే చర్యలు తీసుకున్నామని చెప్పారు. అవి ఏపీ విజయ బ్రాండ్ పేరుతో ప్రైవేట్ డెయిరీలు తయారీ చేస్తున్నట్టు గుర్తించి ఆ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.