హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల సేవలో ప్రజా ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. జబ్బుపడిన గరీబోళ్లకు ఇది మేమిచ్చిన భరోసా’ అని ఇటీవల పంద్రాగస్టు వేడుకల సందర్భంగా గోల్కొండ కోట సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదనే విషయం దీంతో తేటతెల్లమైంది. ‘ఇది మా కాంగ్రెస్ బ్రాండ్ స్కీం’ అంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి.. నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలకు ఏకంగా 8 నెలలుగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
దీంతో ఆయా దవాఖానల యాజమాన్యాలు అసలు ఆరోగ్య శ్రీ సేవలు నిలుపుదల చేయాలని నిర్ణయిచారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజారోగ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. గత ఎనిమిది నెలలుగా రూ.1,400 కోట్ల బకాయిలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించ్సాలి ఉన్నది. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్ఎస్) కింద అందిస్తున్న సేవలకు గాను చెల్లింపులు జరగకపోవడంతో దవాఖానల నిర్వహణ భారంగా మారిందని నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు వాపోతున్నాయి.
ఆరోగ్య శ్రీ పథకంలో 300 వరకు నెట్వర్క్ దవాఖానలు రాష్ట్రంలో ఉన్నాయి. బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం కారణంగా అనేక దవాఖానలు వరుసగా నెట్వర్క్ నుంచి తప్పుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి రూ.1,100 కోట్ల బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో గత జనవరిలో వైద్యసేవలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిలిపివేసింది.
ఆ సమయంలో రెండు నెలల్లో పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈవో హామీ ఇచ్చినట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం హామీతో నెట్వర్క్ దవాఖానల్లో తిరిగి సేవలను కొనసాగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది నెలలు గడిచినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో తాజాగా ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. బకాయిల చెల్లింపులతోపాటు తమ కీలక డిమాండ్లను ప్రభుత్వం నెరవెర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అసోసియేషన్ కోరుతున్నది.
గ్రీన్ చానల్ ద్వారా ఆరోగ్యశ్రీ నిధులను నెట్వర్క్ దవాఖానలకు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేకపోయింది. ప్రతినెలా రూ.200 కోట్లు చెల్లిస్తామన్న ఆ హామీని విస్మరించింది. ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనతతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు సమ్మె చేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతే పేదలకు తీవ్రనష్టం జరగనున్నది.
ఆరోగ్య శ్రీ బకాయిల పెండింగ్ కారణంగా చిన్న దవాఖానలను మూసేసే పరిస్థితి దాపురించింది. కొన్నింటిని వేరే కార్పొరేట్ దవాఖానలకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి ఆరోగ్య శ్రీ నెట్వర్క్ దవాఖానలకు బకాయిలను వెంటనే చెల్లించాలి. పేమెంట్ ఎప్పటికప్పుడు చెల్లించి, ఒప్పందం పునరుద్ధరించాలి. రెండు నెలల్లో బకాయి బిల్లులు చెల్లిస్తామని గత జనవరిలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు పెండింగ్ బకాయిలను చెల్లించనేలేదు. ఆరోగ్యశ్రీ కమిటీలో ప్రభుత్వాధికారులే కాకుండా, ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలనూ భాగస్వామ్యం చేయాలి. నేతల మాటలకు, చేతలకు పొంతన ఉండటమే లేదు.
-వడ్డరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్