ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామస్థులు తాగునీటి కోసం శనివారం రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎస్సై ప్రవీణ్ చేరుకుని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలుపడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామంలో 100 గడపలు, 300 మందికిపైగా జనాభాకు పంట చేనులో వేసిన బోరు ద్వారానే నీటి సరఫరా అవుతున్నదన్నారు. మోటరుకు బిగించిన స్టార్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే తమకు నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ శనివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామస్థులు ఖాళీ బిందెలతో జీపీని ముట్టడించారు. ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ఖాజాపూర్‌లో ‘తాగునీటి కోసం తండ్లాట’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో తహసీల్దార్ హేమంత్‌కుమార్ స్పందించి శనివారం ఆర్ఐ మదన్, కార్యదర్శి వెంకటేశ్‌ను పంపారు. జీపీకి వీరు రాగానే గ్రామస్థులు వారిని చుట్టుముట్టారు. నీటి సమస్య పరిష్కరించేవరకు కార్యదర్శిని ఇక్కడి నుంచి కదిలించేదే లేదని భీష్మించారు. సిర్గాపూర్ ఎస్సై మహేశ్ చేరుకుని అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని గ్రామస్థులకు చెప్పడంతో ఆందోళన విరమించారు.
– సిర్గాపూర్
కామారెడ్డి పట్టణం రెండో వార్డు రామేశ్వర్‌పల్లి పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీవాసులు నెల రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదంటూ శనివారం కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ డీఈ హన్మంత్‌రావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
– కామారెడ్డి