హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా తాండూరు కందిపప్పునకు విశ్వవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాణ్యతతోపాటు రుచి, సువాసన, పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ రకం కంది ఎక్కువకాలం నిల్వ ఉంటుందని చెప్పారు. తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు (జీఐ) వచ్చేందుకు కృషి చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులను 31న తాండూరులోని కంది పరిశోధన క్షేత్రంలో సన్మానించనున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాండూరు నేలల స్వభావం, అందులోని పోషకాలు, వాతావరణ అనుకూల పరిస్థితులు, రైతుల సంప్రదాయ సాగు పద్ధతుల వల్లే ప్రత్యేక గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 ఉత్పత్తులకు గుర్తింపు లభించగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 6 ఉత్పత్తులు.. పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్ (2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022)కి భౌగోళిక గుర్తింపు వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం డైరెక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్‌ను మంత్రి అభినందించారు.