హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినమంటూ వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. గవర్నర్ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడటం సమంజసంకాదని చెప్పారు. బీజేపీ నేతల స్క్రిప్టును గవర్నర్ చదివారంటూ విమర్శించారు. తెలంగాణ చరిత్రను మరోసారి చదువుకోవాలని, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.