Tammineni Veerabhadram | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. మిర్యాలగూడ, వైరా స్థానాలపై తేల్చేందుకు తాము విధించిన డెడ్లైన్ ముగిసినప్పటికీ కాంగ్రెస్ స్పందిచకపోవడంతో 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. రెం డు, మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్లోని ఎంబీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వైరా విషయం లో భట్టి విక్రమార్క మాట మార్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక సీటునూ గెలవొద్దని, ఆ పార్టీని ఓడించేందుకు కొన్నిచోట్ల బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల్లేని శాసనసభ దేవుడు లేని దేవాలయం లాంటిదని వ్యాఖ్యానించారు. సీపీఐ పోటీ చేసే చోట తాము పోటీ చేయబోమని, ఆ పార్టీకే మద్దతిస్తామని స్పష్టం చేశారు.
సీపీఎం పోటీచేసే అసెంబ్లీ స్థానాలు
భద్రాచలం(ఎస్టీ), అశ్వారావుపేట(ఎస్టీ), పాలేరు, మధిర(ఎస్సీ), వైరా(ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి(ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్(ఎస్సీ), భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్.