హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమని గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్ అన్నారు. కొవిడ్ టీకా మొదటి డోస్ వంద శాతం పూర్తి కావడంతో ప్రభుత్వాన్ని, వైద్యశాఖ మంత్రిని, సిబ్బందిని గవర్నర్ అభినందించారు. దేశంలోనే తెలంగాణ ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ కేక్ కట్‌చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ క్లాస్‌ల కోసం సేవా, ఐవిష్ ఇంటర్నేషనల్ సంస్థలు అందజేసిన 20 ల్యాప్‌టాప్‌లను పేద గిరిజన, దివ్యాంగ విద్యార్థులకు అందజేశారు. పేద విద్యార్థుల నుంచి 2 వేల అభ్యర్థనలు వచ్చాయని, ప్రాధాన్యతా క్రమంలో వారికి కూడా అందజేస్తామని, సమకూర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఐటీ కంపెనీలు ముందుకు రావాలని గవర్నర్ కోరారు. కొత్త సంవత్సర కానుకగా ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించడానికి రాజ్‌భవన్ ఎదుట బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్‌భవన్ సిబ్బంది నుంచి అర్జీలను స్వీకరించడానికి మరో బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.