Sircilla | రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ): ఎప్పటిలాగే ఈ సారి పొంగల్ చీరల ఆర్డర్లు వచ్చేశాయి. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చీరలతో సిరిసిల్ల నేతన్నకు ఊరట లభించింది. బతుకమ్మ చీరల బంద్‌తో మూతపడ్డ వస్త్ర పరిశ్రమకు ‘అమ్మ చీర’ జీవం పోసింది. తమిళనాడు ప్రభుత్వం ఏటా ఆర్డర్లు ఇక్కడికే ఇస్తూ వస్తున్నది. సుమారు 15 ఏండ్ల క్రితం లక్ష మీటర్ల ఆర్డర్లు ఇచ్చిన అక్కడి ప్రభుత్వం నేడు కోట్లకు చేరింది. అమ్మ చీరల పేరుతో సంక్రాంతికి (పొంగల్) పంపిణీ చేస్తున్నది. పురుషులకు పంచె, శెల్ల పంపిణీ చేస్తుండగా వాటి ఆర్డర్లు సైతం సిరిసిల్లకే అత్యధికంగా ఇస్తున్నది.
రెండు కోట్ల మీటర్ల బట్టతో 30 లక్షల చీరలు మూడు వేల సాంచాలపై తయారవుతున్నాయి. 5.50 మీటర్లవి 40 రంగుల్లో తయారు చేస్తున్నారు. రోజూ రెండు లక్షల మీటర్ల వస్ర్తాలు తయారు చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు తమిళనాడుకు తరలిస్తున్నారు. ఈ చీరల తయారీతో వెయ్యి మందికి ఉపాధి లభిస్తున్నది. ఇందులో నేత కార్మికులు, వైపనీ, వార్పిన్, హమాలీ, ప్యాకింగ్, గుమస్తాలకు చేతినిండా పని దొరికింది. పొంగల్ చీరల తయారీతో నెలకు రూ.10 వేల నుంచి రూ.13 వేలు వస్తున్నట్టు కార్మికులు తెలిపారు.