Tomato Price | హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): ధరల నియంత్రణలో కేంద్రంలోని మోదీ సర్కారు ఘోరంగా విఫలమైంది. మొన్నటిదాకా పెట్రోల్, వంటగ్యాస్ ధరలు ఆకాశానికి చేరాయి. ఆ తర్వాత వంటనూనెలు రికార్డు గరిష్ఠాన్ని అందుకొన్నాయి. ఇప్పుడేమో టమాట, చింతపండు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక తన వంతు అన్నట్టు అల్లం ధర కూడా అందనంత ఎత్తుకు చేరుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో కిలో అల్లం ధర రూ.400కు చేరింది. దీంతో సామాన్యుడి బతుకు బడ్జెట్ తలకిందులైంది. నిత్యావసరాల రేటు ఒక్కోటి పోటాపోటీగా పెరుగుతూ పోతున్నా, కేంద్రం ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ధరలను ద్రవ్యోల్బణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాన్యుడు బతుకుబండిని లాగటం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటక బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో అల్లం ధర రూ.300-400 పలుకుతున్నది. 60 కిలోల బ్యాగు ఒక్కోటి రూ.11 వేలు ఉంటున్నది. గత ఏడాది ఇదే సమయానికి బ్యాగు ధర రూ.2 వేలు- రూ.3 వేల మ ధ్య ఉండేదని వ్యాపారులు చెప్తున్నారు. గత దశాబ్ద కాలంలో అల్లం ధరలు ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ పెరగలేదని అంటున్నారు.
రెండు నెలల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయించే చింతపండు ప్రస్తుతం రూ.120 నుంచి రూ.200 వరకు పలుకుతున్నది. చింతపండుకు అతిపెద్ద వ్యాపార కేంద్రమైన కర్ణాటకలోని తముకూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో టోకు ధరలు కూడా భారీగా పెరిగాయి. గత రెండు పంటల సీజన్లో వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయిందని రైతులు పేర్కొంటున్నారు. సగటున ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేదని, గత రెండేండ్లుగా ఎకరానికి 1 నుంచి 2 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు చెప్తున్నారు. కిలో రూ.100 దాటిన టమాటకు ప్రత్యామ్నాయంగా చింతపండును వాడటమే ధర పెరగడానికి ప్రధాన కారణమని అంటున్నారు. గత జూలైతో పోలిస్తే ఈ నెలలో 40 శాతం ఎక్కువ డిమాండ్ ఉన్నదని తుమకూరు ఏపీఎంసీ హోల్సేల్ వ్యాపారులు తెలిపారు. ఇక్కడ పీక్ సీజన్లో రోజుకు సగటున 260 నుంచి 300 క్వింటాళ్ల చింతపండు కొనుగోలు అవుతుంది.
జూలై 19న 98 క్వింటాళ్లు క్వింటాలుకు రూ.14 వేల చొప్పున కొనుగోలు చేయగా, గత ఏడాది ఇదే తేదీన క్వింటాలుకు రూ.1,720 చొప్పున కొనుగోలు చేశారు. కేంద్ర ఉద్యానవన శాఖ అందించిన సమాచారం ప్రకారం.. 2018లో చింతపండు 12,173 హెక్టార్లలో సాగు చేయగా, 58 వేల టన్నుల దిగుబడి వచ్చింది. 2021-22లో 10,508 హెక్టార్లలో సాగు చేయగా 40,068 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. చింతపండును పండించే మొదటి ఐదు రాష్ర్టాల్లో కర్ణాటక అగ్రస్థానంలో ఉన్నది. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో శీతల గిడ్డంగులు ఉన్నాయి. అక్కడ వ్యాపారులు పెద్ద మొత్తంలో చింతపండును నిల్వచేసి ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు విక్రయిస్తారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
హైదరాబాద్లో కిలో టమాట రూ.170 వరకు పలుకుతున్నది. నాణ్యతను బట్టి ఇంకా ఎక్కువే. కూకట్పల్లి రైతుబజార్లో టమాట ధర కిలో రూ.69గా ఉండగా, మిగతా ప్రాంతాల్లో ధర మండిపోతున్నది. అల్లం ధర కూడా కిలో రూ.260 పలుకుతున్నదని వినియోగదారులు తెలిపారు. కర్ణాటకలో కిలో టమాట రూ.400 ఉన్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.