హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాలపై రాష్ట్రంలోని బీసీలందరినీ జాగృత పరుస్తామని, పోరుబాటలోకి తీసుకొస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటానికి బీఆర్ఎస్ పూనుకుంటుందని స్పష్టంచేశారు. పార్టీ పెద్దలతో చర్చించి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని ఐక్యపోరాటం సాగిస్తామని, తమ ఉద్యమంలోకి బీసీ సంఘాలు, బీసీ మహిళలు, యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజాప్రభుత్వం కాదని, దగా ప్రభుత్వమని ధ్వజమెత్తారు. బీసీ వర్గాలకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని చెప్పారు.
దానికి కొనసాగింపుగా.. పార్లమెంట్లో బిల్లు ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత లభిస్తుందన్న విషయాన్ని ఆ సమయంలోనే తాము ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. తమ సూచనను పెడచెవిన పెట్టిన సర్కార్.. మొదటి నుంచి బీసీలకు 42% కోటా అమలు విషయంలో చిత్తశుద్ధిని చూపలేదని దుయ్యబట్టారు. బీసీ వర్గాలను మభ్యపెట్టే కుట్రతోనే బిల్లులు, ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన చేసి అనేక కుయుక్తులు పన్నిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్‌కు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే.. బీసీ బిల్లు చట్టబద్ధత కోసం రాష్ట్రపతిని ఎందుకు కలువలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేలేదని తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎందుకు రాలేదని నిలదీశారు.
సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సర్పంచ్ ఎన్నికల్లో 17.08% సీట్లే కేటాయించి అవమానిస్తారా? అని తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతి లో రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. వెంటనే సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం 42% కోటాతోనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే బీఆర్ఎస్ హయాంలో కోర్టు ఆదేశాల ప్రకారం 22 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌కు దమ్ముంటే పార్టీపరంగా ఇస్తామన్న 60% రిజర్వేషన్లతో రూపొందించిన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను వారం రోజుల్లో ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తలసాని డిమాండ్ చేశా రు. పార్టీలకతీతంగా జిల్లాల్లో మంత్రు లు, కాంగ్రెస్ నాయకులను బీసీలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరిగేందుకు బీసీ మంత్రులు సీఎంపై ఒత్తిడి తేవాలని, లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు వదలబోమని హెచ్చరించారు.