హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మూడు, నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. వచ్చేవారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ భేటీ ఉంటుందని తెలిపారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియా చిట్చిట్లో మాట్లాడారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీపై 17న నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నంబర్ గేమ్‌ను బట్టి మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై నిర్ణయం ఉంటుందని వివరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చే వారం పార్టీ కార్పొరేటర్లతో మీటింగ్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర బీసీల్లో అవగాహన పెరిగిందని, ఉద్యమం బలంగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ తెలిసే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని తలసాని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పార్టీ పరంగా బీసీ సంఘాలు, కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉన్నదని, రాష్ట్రంలో బీసీలు 57-58 శాతం ఉంటారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51 శాతం మంది ఉన్నట్టు తేలిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల జనాభా ఎలా తగ్గిందని నిలదీశారు. ఏడాదికి సగటున 1.3 శాతం జనాభా పెరుగుదల ఉంటుందని, రాష్ట్రంలో 60 లక్షల మందికి లెకలు లేవని, బీసీ ముస్లింల జనాభా పెరగలేదు కానీ, ఓసీ ముస్లింల జనాభా పెరిగిందంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రీసర్వే చేయాలని, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలంతా సర్వేలో పాల్గొంటామని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే బీసీలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తకువ చూపిస్తే నిధులు తకువ వస్తాయని, పునర్విభజన జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు తెలంగాణకు తగ్గుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.